ఏకధాటి వర్షాలతో హైదరాబాద్ నగరం తడిసి ముద్దవుతోంది. గత మూడు రోజులుగా అడపదడపా పడుతున్న వర్షం.. సోమవారం ఉదయం నుంచి బాగా పెరిగింది. కుండపోత వర్షంతో హైదరాబాద్ నగరంలోని కొన్ని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కొన్ని ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షాలతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుండటంతో ఆఫీసులకు వెళ్లేవారికి ఆటంకం కలుగుతోంది.
మరోవైపు ఇదే పరిస్థితి మరో ఐదు రోజులపాటు కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న మూడు రోజుల్లో నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం సంచాలకుడు వై.కె. రెడ్డి చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారుతోందని, ఒడిశా, కోస్తాంధ్రల మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం భూమికి 7.6 కిలోమీటర్ల ఎత్తున విస్తరించి ఉండటంతో దాని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశాలున్నాయని తెలిపారు.
మూడు రోజుల నుంచి తెలంగాణలో భారీవర్షాలు కురవడంతో వాగులూ, చెరువులు పొంగుతున్నాయి. మహబూబాబాద్, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్ అర్బన్, గ్రామీణ, జయశంకర్ భూపాలపల్లి, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక ప్రాంతాల్లో 6 సెం.మీ.పైగా వర్షం కురిసింది. రికార్డుస్థాయిలో మహబూబాబాద్ జిల్లా పాకాల కొత్తగూడలో 9.3 సెం.మీ వర్షం నమోదైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 5.7 సెం.మీ. వర్షపాతం కురిసింది.