మెట్రో రైలు ప్రాజెక్టుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సకాలంలో నిధులు విడుదల చేస్తూ పనులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూస్తోంది. ఫలితంగా అనుకున్న సమయానికి మెట్రో రైల్ ప్రాజెక్టును పూర్తి చేయాలన్న టార్గెట్ తో అధికారులు నిర్మాణ పనులను మరింత వేగవంతం చేశారు. తాజాగా మెట్రో ఇంజనీర్లు అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. కేవలం 25 రోజుల్లోనే మలక్‌పేట మెట్రో ఆర్వోబీని పూర్తి చేసి.. దేశంలోనే సరికొత్త ఇంజనీరింగ్ రికార్డు క్రియేట్ చేశారు. 164 అడుగుల పొడవు గల మలక్‌పేట మెట్రో ఆర్వోబీ ప్రధాన స్పాన్ ను మెట్రో ఇంజనీర్లు కేవలం 25 రోజుల్లోనే పూర్తి చేశారు. ఈ ఘనత సాధించడంలో నిర్మాణ రంగంలో అనుభవజ్ఞులైన అనేకమంది నిపుణుల ప్రణాళికలు, రైల్వే ఇంజనీర్ల కృషి ఉంది. మొత్తం 394 అడుగుల పొడవుగల మలక్ పేట ఆర్వోబీని 58 అడుగుల ఎత్తులో నిర్మించారు. బేగంపేట వద్ద నిర్మించిన పద్దతిలోనే మలక్‌పేటలో కూడా బ్రిడ్జ్ బిల్డర్ ని ఉపయోగించారు. రెండు వంద టన్నుల గల భారీ క్రేన్లని ముందుగా వయాడక్ట్ కి రెండు వైపులా బిగించి.. నిర్మాణం కొనసాగించారు.