పాట్నా: ఎన్డీయేతో నితీశ్ మళ్లీ చేతులు కలపడంపై అసంతృప్తిగా ఉన్న శరద్ యాదవ్ జేడీ (యూ)ని వీడి మరో కొత్త పార్టీ పెట్టాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏతో పొత్తుకు ఆయన ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే శరద్ యాదవ్ జేడీయూలోని కొందరు కీలక నేతలతోపాటు తనతో కలిసి వచ్చే వివిధ పార్టీల్లోని వ్యక్తులతో మాట్లాడుతున్నారని ఆయన సన్నిహితుడు విజయ్ వర్మ వెల్లడించారు. ఈ వారంలోనే కొత్త పార్టీని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే ఆయన నితీశ్‌కు దూరమైనట్లు జేడీయూ నేతలు కూడా అంగీకరిస్తున్నారు. శరద్ యాదవ్ తమ పార్టీలోని సీనియర్ నేత అయినా ఆయన వేరే మార్గాన్ని ఎంచుకున్నారని, ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే స్వేచ్ఛ ఆయనకు ఉందని జేడీయూ అధికార ప్రతినిధి సంజయ్ సింగ్ తెలిపారు. శరద్ యాదవ్ పార్టీని వీడుతున్నట్లు వచ్చిన వార్తలపై నితీశ్‌ను ప్రశ్నించగా ఆయన తేలిగ్గా తీసుకున్నారు. ఎవరికి తెలుసు? నాకైతే భారం తగ్గొచ్చు. మా పార్టీకి కేవలం బీహార్‌లోనే గుర్తింపు ఉంది. ఇతర రాష్ట్ర యూనిట్స్‌తో నాకు సంబంధం లేదు అని నితీశ్ అన్నారు.