ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వం ఏ ఆర్డర్ తీసినా.. కాంగ్రెస్ పార్టీ వాటిపై కేసులు వేస్తుంది

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 03, 2017, 09:07 AM

కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్ రావు నిప్పులు చెరిగారు. ప్రభుత్వం ఏ ఆర్డర్ తీసినా.. కాంగ్రెస్ పార్టీ వాటిపై కేసులు వేస్తోందని మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టులు, ఉద్యోగ ప్రకటనలు తదతర వాటిపై కాంగ్రెస్ పార్టీ 196 కేసులు వేయడంపై ఆయన ఘాటుగా స్పందించారు. బుధవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో కేసీఆర్ రెండు గంటల పాటు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ‘పిల్ కాంగ్రెస్.. పిల్లి కాంగ్రెస్.. చిల్లరమల్లర, దగాకోరు, దగుల్బాజీ, థర్డ్‌రేట్ రాజకీయాలు చేసే కాంగ్రెస్’ అని తిట్టిపోశారు.


విషపూరిత ఆలోచనలు చేసే కాంగ్రెస్ పిశాచని, భూతమని, తెలంగాణ పాలిటి నెంబర్ 1 విలన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఏం కేసులివి? ప్రాజెక్టులపై, ఉద్యోగాలపై, కాంట్రాక్టు సిబ్బంది క్రమబద్ధీకరణపై, సింగరేణి వారసత్వ ఉద్యోగాలపై, సచివాలయం నిర్మాణంపై, భగీరథపై, చివరికి అమరుల స్తూపంపై కేసులు వేశారు. హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనపై కూడా కేసు వేశారు. అదే కంపులో బతకాలి మనం. కొన్ని వందల కేసులు.. సాగునీటి ప్రాజెక్టులపై 160 కేసులా? ఏ రాష్ట్రంలోనైనా ఉంటాయా? గవర్నమెంట్ ఆర్డర్ తీయాలె.. కాంగ్రెస్ కేసులు వేయాలె! ఏ పనిచేసినా కేసులు వేస్తరు. స్టే తెస్తరు. అంత గొప్పోళ్లు వీళ్లు! ఏ పథకాన్నీ ముందుకు పోనియ్యరు. కేసులు వేసి తెలంగాణ అభివృద్ధుని అడ్డుకుంటారా? తెలంగాణ బిడ్డలేనా వీళ్లు! కాంగ్రెస్ పని ఎట్లున్నదంటే.. మేం ముండమోసి పని చేసినం, మీరు అట్లనే చేయండంటుంది. వారి నోరా తాటిమట్టా? మకిలి వెకిలి పని చేసి మా ఉక్కు సంకల్పాన్ని దెబ్బతీయలేరు’ అని చెడుగుడు ఆడేశారు.


కాంగ్రెస్‌పై కేసీఆర్ ఈ స్థాయిలో విరుచుకుపడటం ఇంతకు ముందుకు ఎవరూ చూసుండరేమో. కేసీఆర్ అభిమానులైతే ఆయన మాట్లాడుతున్నంతసేపు పండగ చేసుకుని ఉంటారు. ప్రతి మాటా ఓ తూటా. ‘కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం గొంతు నులిమేయడానికి 196 కేసులు వేసి విషపూరితంగా వనిచేస్తున్న విలన్ ఈ కాంగ్రెస్ పార్టీ. ఇది నేను ఈ రోజు కొత్తగా చెప్తున్నది కాదు. 2001 ఏప్రిల్ 27న జలదృశ్యంలో నా మొదటి ప్రసంగంలో తెలంగాణ దుస్థితికి నంబర్ వన్ విలన్ కాంగ్రెసే కారణం అని చెప్పిన. ఇది 100 శాతం నిజం. నాటి నుంచి నేటి దాకా తెలంగాణ ప్రజల పాలిట పిశాచి.. ఈ కాంగ్రెస్ భూతం’ అని కేసీఆర్ మండిపడ్డారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com