ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడే ఎస్సారెస్పీ పున‌ర్జీవ స‌భ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 10, 2017, 10:52 AM

సమైక్య పాలనలో ఎస్సారెస్పీ కట్టినట్టు చూపించారు. నీళ్లిచ్చినట్టే మభ్యపెట్టారు. కానీ పూర్తిస్థాయిలో ఎప్పుడూ నీళ్లు ఇయ్యలేదు. చివరి ఆయకట్టుదాకా నీరు చేరలేదు. రైతులు సాగునీరు లేక తల్లడిల్లారు. ఇప్పుడు మనం పోరాడి తెలంగాణ తెచ్చుకున్నం. దాని ఫలితం రైతులకు దక్కాలి. రైతులు మొగులుకు ముఖం పెట్టి చూడొద్దు. కాల్వల ద్వారా వారికి రెండు పంటలకూ నీరందాలి.. ఇదీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యం! ఆ లక్ష్యాన్ని చేరే సమయం రానే వచ్చింది. కేవలం ఒకే ఒక్క ఏడాదిలో ఉత్తర తెలంగాణకు ఊపిరి రానుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు సరికొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టనుంది. నిన్నటిదాకా పేరుకే ఉత్తర తెలంగాణ వరప్రదాయినిగా ఉన్న ఈ చారిత్రాత్మక ప్రాజెక్టును ఆచరణలో వరప్రదాయినిగా మార్చేందుకు రాష్ట్ర సర్కారు నడుం బిగించింది. శ్రీరాంసాగర్ పునర్జీవ పథకంతో ప్రాజెక్టు వాస్తవ డిజైన్‌లోని 16 లక్షల ఎకరాలకు రెండు పంటలకూ సాగునీరు ఇచ్చే బృహత్తర కార్యక్రమానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. వచ్చే వానాకాలం పంట సీజన్‌ నాటికి ఈ పథకాన్ని సిద్ధంచేసే లక్ష్యంతో గురువారం ఎస్సారెస్పీ పునర్జీవ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. తెలంగాణ సాగునీటి ముఖచిత్రంలో పెను మార్పును తీసుకువచ్చే పథకం కావడంతో శ్రీరాంసాగర్ చారిత్రక నేపథ్యంతోపాటు పునర్జీవ పథకంపై గురువారం మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించే బహిరంగ సభలో సీఎం కేసీఆర్ సమగ్ర వివరాలను రైతుల ముందుంచనున్నారు. ఈ సభకు పెద్ద సంఖ్యలో తరలి రావడానికి రైతులంతా సిద్ధమవుతున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa