క్రికెట్ ఆడేందుకు ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్‌కి బీసీసీఐ లేదా పరిపాలకుల కమిటీ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే చాలని మిగతాదంతా తాము చూసుకుంటామని కేరళ క్రికెట్ అసోసియేషన్ (కేసీఏ) ప్రకటించింది. 2013లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో శ్రీశాంత్‌పై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించగా.. ఇటీవల కేరళ హైకోర్టు దాన్ని ఎత్తివేయాలని తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఈ తీర్పుపై తమ నిర్ణయమేంటో బీసీసీఐ ఇంకా అధికారికరంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. ఒకవేళ.. శ్రీశాంత్‌కి బీసీసీఐ నుంచి క్రికెట్ ఆడేందుకు అనుమతి లభిస్తే.. అతడికి కావాల్సిన సదుపాయాలు సమకూర్చి జట్టులో పునరాగమనానికి తమ వంతు సాయం చేస్తామని కేసీఏ స్పష్టం చేసింది.
‘దేశవాళీ క్రికెట్ సీజన్ మరికొద్దిరోజుల్లోనే ప్రారంభంకానుంది. కాబట్టి శ్రీశాంత్ ట్రైనింగ్, ఫిటెనెస్‌కి అవసరమైన సాయం చేసేందుకు కేసీఏ సిద్ధంగా ఉంది. త్వరలోనే సీజన్ కోసం జట్టు ఎంపిక ప్రక్రియ మొదలవుతుంది. ఈలోపు బీసీసీఐ లేదా పరిపాలకుల కమిటీ నుంచి శ్రీశాంత్‌కి క్లియరెన్స్ వస్తే.. మేము కేరళ జట్టులో అతని పునరాగమనానికి ఏర్పాట్లు చేస్తాం’ అని కేసీఏ తెలిపింది. భారత్ తరఫున 2019 ప్రపంచకప్‌లో ఆడాలనేది తన కల అని ఇప్పటికే శ్రీశాంత్ ప్రకటించిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa