నేత్రదానం చేస్తానని ప్రకటించిన సీఎం

  Written by : Suryaa Desk Updated: Sun, Aug 13, 2017, 04:37 PM
 

పాట్నా: సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. మనిషి మరణించిన తర్వాత కూడా ఆ కళ్లు సజీవంగా ఉంచగలిగేదే నేత్రదానం. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన కళ్లను దానం చేయాలనుకుంటున్నట్టు ప్రకటించారు. అంతర్జాతీయ అవయదాన దినోత్సవం సందర్బంగా ఆదివారంనాడిక్కడ జరిగిన కార్యక్రమంలో నితీష్ ఈ ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా అవదాయదానం ప్రాధాన్యతను తెలియజేసే విధంగా ప్రచారం జరగాలని ఆయన అభిలషించారు. 'మద్యపాన నిషేధంపై మనం ఎలాగైతే ప్రచారం చేశామో, కళ్లు, ఇతర అవయవదానంపై కూడా విస్తృత ప్రచారం జరపాల్సిన అవసరం ఉంది' అని ఆయన ఈ సందర్భంగా అన్నారు. 2017 డిసెంబర్ నాటికి బీహార్‌లోని అన్ని మెడికల్ కాలేజీ ఆసుపత్రుల్లోనూ కంటి ఆసుపత్రులు, ఐ బ్యాంక్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. ఆరోగ్యరంగంలో చాలా సాధించామని, ప్రతినెలా 11 వేల మంది ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చి వైద్యసేవలు పొందుతున్నారని నితీష్ తెలిపారు.