హైదరాబాద్ : హైదరాబాద్ నగరం హెల్త్‌కేర్ హబ్‌గా గుర్తింపు దక్కించుకుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కే తారకరామారావు చెప్పారు. మెరుగైన వైద్య సదుపాయాలు, అందుబాటు ధరల్లో వైద్యసేవలు అందించడం ద్వారా హైదరాబాద్ ఈ ప్రత్యేకతను సంతరించుకున్నదన్నారు. అమెరికాకు చెందిన సెలస్ కేర్ సంస్థ ఏర్పాటు చేసిన వర్చువల్ హెల్త్ క్లినిక్‌ను మంత్రి కేటీఆర్ మంగళవారం తాజ్ కృష్ణాలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సెలస్ వంటి సంస్థలు వైద్యరంగంలో టెక్నాలజీని సమర్థంగా వినియోగిస్తున్నాయన్నారు. చిన్న పరికరాన్ని కేవలం 30 సెకన్లు పట్టుకోవడం ద్వారా ఈసీజీ పరీక్షను పూర్తిచేయటమేగాక, ఆ వెంటనే మన సెల్‌ఫోన్‌లో పరీక్ష ఫలితాలు చూసుకోగలిగిన టెక్నాలజీని సెలస్ కేర్ అందుబాటులోకి తెచ్చిందని చెప్పారు. చక్కెర వ్యాధిగ్రస్తులకు సంబంధించి అధునాతన పరీక్షలకు సెలస్ కేర్ కేంద్రంగా ఉందన్నారు. ఈ సంస్థ తమ పరిశోధన,అభివృద్ధి కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తామనడాన్ని ఆయన స్వాగతించారు. ఇందుకోసం బుద్వేల్ దగ్గర స్థలం కేటాయిస్తామని, ప్రభుత్వపరంగా సహాయ సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు.
తన నియోజకవర్గం సిరిసిల్లలో 10 ప్రాథమిక వైద్య కేంద్రాలను మెరుగైన వైద్యసేవలందించేలా తీర్చిదిద్దే పైలట్ ప్రాజెక్టు కోసం సెలస్ కేర్ ఎంపిక చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అమెరికాకు చెందిన ప్రఖ్యాత వైద్య నిపుణుడు స్టీఫెన్ స్టీన్‌బల్ మాట్లాడుతూ టెక్నాలజీ ఫలాలు వైద్యరంగంలో మార్పులు తేవడమే కాకుండా ప్రజలకు చేరువయ్యేలా ఉండాలన్నారు. శాంతా బయోటెక్ వ్యవస్థాపకుడు వరప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ సమాజ అవసరాలకు సాంకేతిక సౌలభ్యాన్ని అనుసంధానం చేస్తే ప్రజల జీవితాల్లో మార్పులు వస్తాయన్నారు. సెలస్ కేర్ కో-ఫౌండర్ రాజా కొప్పల, సీఈవో రఘు బత్తిన తదితరులు మాట్లాడారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa