న్యూజిలాండ్ : న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ లో తెలంగాణ జాగృతి ఏర్పాటు చేసిన చేనేత బతుకమ్మ స్టాల్ విశేషంగా ఆకర్షించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా నేతన్నలను ఆదుకునే ఉద్దేశంతోనే ఈ స్టాల్ ఏర్పాటు చేశామని టిఆర్ఎస్ న్యూజిలాండ్ శాఖ అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. ఇది నిరంతరం కొనసాగిస్తామన్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా సిరిసిల్ల నేతన్నలు తయారు చేసిన ఉత్పాదనలు నేరుగా వారివద్దే కొని న్యూజిలాండ్ ప్రజలకు అందించడమే తమ లక్ష్యం అన్నారు. నల్ల విజయకుమార్ నేసిన అగ్గిపెట్టెలో పట్టే చీరను విమెన్ అఫైర్స్ ఛైర్ పర్సన్ సునీతావిజయ్ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఇలాంటి చీరను చిన్నప్పుడు హైదరాబాద్ లోని సాలార్ జంగ్ మ్యూజియంలో చూస్తూ ఉండిపోయి, తప్పిపోయిన సంఘటనను ఆమె గుర్తు చేసుకున్నారు. ఈ రోజు తన చేతుల మీదుగా ఈ చీర ఆవిష్కరణ జరగడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. మనకు నచ్చినట్టు పట్టు చీరలు డిజైన్ చేయించుకుని నేతన్నలకు పని కల్పించాల్సిన బాధ్యత తెలంగాణ ఆడపడుచులందరిపై ఉందన్నారు.జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కల్వకుంట్ల కవిత గత సంవత్సరం న్యూజీలాండ్ లో బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడం వల్లనే ఈ సంవత్సరం ఉత్సవాలకు విశేష స్పందన వచ్చిందని టిఆర్ఎస్ న్యూజిలాండ్ శాఖ గౌరవ చైర్ పర్సన్ కళ్యాణ్ రావు కాసుగంటి అన్నారు. ఈ ఒరవడిని తెలంగాణ వాసులు కొనసాగించాలని కోరారు.