ఇండోర్: టీమ్ ఇండియా యువ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య క్రీజులో కుదురుకున్నాడంటే సిక్సర్ల మోత మోగాల్సిందే. ప్రస్తుత ఆస్ట్రేలియా సిరీస్‌లో పాండ్య రెండు అర్ధశతకాలు సాధిస్తే అందులో 9 సిక్సర్లున్నాయి. మూడో వన్డేలో తాను ఎదుర్కొన్న నాలుగో బంతినే సిక్సర్‌గా మలిచాడు. కొన్ని నెలల కిందట పాకిస్థాన్‌తో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోనూ పాండ్య ఇలాగే విరుచుకుపడ్డాడు. ఆ ఇన్నింగ్సే మీ కెరీర్‌ను మలుపు తిప్పిందా అని అడిగితే.. ‘‘అలా అనుకుంటే అనుకోండి. కానీ నేను అంతకుముందు కూడా ఇలాగే ఆడేవాడిని. గత ఏడాది ఐపీఎల్ నాకు బాగా కలిసొచ్చింది. అక్కడ కూడా నా ఆటతీరు ఇలాగే ఉండది. అసలు నేను చిన్నప్పటి నుంచే సిక్సర్లు బాదడం అలవాటు చేసుకున్నా. ఇప్పుడు అత్యున్నత స్థాయిలోనూ అలాగే ఆడుతున్నా. ఏమీ చూడకుండా బాదేయడం ఉండదు. ముందు మ్యాచ్ పరిస్థితుల్ని అర్థం చేసుకుంటా. చెన్నైలో జంపా బౌలింగ్‌ను ముందు పరిశీలించాను. నేను అతడి బౌలింగ్‌లో ఏ స్థితిలోనైనా సిక్సర్ బాదగలనని తెలుసు. అందుకే ఎదురు చూసి ఆ తర్వాత షాట్లు ఆడాను’’ అని పాండ్య అన్నాడు.