ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డీఎస్ మీద నిఘా పెట్టించిన గులాబీ బాస్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 26, 2017, 09:27 AM

కాంగ్రెస్ పార్టీలో ఉండ‌గా ఆయ‌న చ‌క్రం తిప్పారు. తిరుగులేని నేత‌గా ఓ వెలుగు వెలిగారు. రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత కాంగ్రెస్ అనూహ్యంగా తెలంగాణ‌లో ఓట‌మిపాలు కావ‌డంతో డీఎస్ కూడా గులాబీ పార్టీలో చేరిపోయారు. అక్క‌డ కూడా త‌న హ‌వా కొన‌సాగిద్దామ‌ని అనుకుంటే, తెరాస‌లో ప‌రిస్థితులు వేరేలా మారాయి! గులాబీ కండువా క‌ప్పుకోగానే స‌ల‌హాదారు హోదా వ‌చ్చింది. రాజ్య‌స‌భ సీటూ వ‌చ్చింది! ఇంకేం.. హ‌వా మొద‌లైంద‌ని అనుకున్నారు.


కానీ, ఆయ‌న‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు ఇంకా న‌మ్మ‌కం కుద‌ర‌ని ప‌రిస్థితే ఉంద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఈ మ‌ధ్య త‌ర‌చూ డీఎస్ పేరు వార్త‌ల్లో ఉంటోంది. కార‌ణం.. ఆయ‌న పార్టీ మార‌తార‌నే చ‌ర్చ‌. ఎప్ప‌టిక‌ప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి ఖండిస్తున్నా.. ఆ క‌థ‌నాల‌కు ఫుల్ స్టాప్ ప‌డ‌లేదు. దీంతో డీఎస్ పైనా ఆయ‌న అనుచ‌ర వ‌ర్గం మీదా గులాబీ బాస్ నిఘా పెట్టించిన‌ట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఉన్న‌ట్టుండి ఇలా నిఘా పెట్ట‌డం వెన‌క కార‌ణాలు కూడా ఉన్నాయి. డీఎస్ కుమారుల్లో చిన్న‌వాడైన అర‌వింద్ ఈ మ‌ధ్య‌నే భాజ‌పాలో చేరిన సంగ‌తి తెలిసిందే. రాజ‌కీయాల్లో త‌న దారి త‌న‌దీ, త‌న తండ్రి దారి వేరే అంటూ ముందుగానే స్ప‌ష్ట‌త ఇచ్చాక‌నే అర‌వింద్ భాజ‌పాలో చేరారు. ఇదే త‌రుణంలో డీఎస్ కూడా క‌మ‌లం గూటికి చేర‌తార‌ని క‌థ‌నాలు వ‌చ్చాయి. అయితే, త‌న కుమారుడు నిర్ణ‌యం ఆయ‌న వ్య‌క్తిగ‌త‌మైంద‌నీ, దాని ప్ర‌భావం త‌న‌పై ఎందుకు ఉంటుందంటూ డీఎస్ ఖండించారు.


స‌రిగ్గా ఈ ద‌శ నుంచే డీఎస్ మీద అధికార పార్టీ నిఘా పెట్టింద‌ని అంటున్నారు! చిన్న కుమారుడు అర‌వింద్ భాజ‌పాలో చేర‌తానే విష‌యం డీఎస్ కు ముందుగానే తెలిసినా, ఆయ‌న్ని నిలువ‌రించే ప్ర‌య‌త్నం ఎందుకు చేయ‌లేక‌పోయార‌ని గులాబీ బాస్ ఆగ్ర‌హంగా తెలుస్తోంది! అందుకే, డీఎస్ వ‌ర్గీయుల ప‌రిస్థితి ఏంటీ, వాళ్ల మ‌ధ్య జ‌రుగుతున్న చ‌ర్చ‌లేంటీ, భాజ‌పాకు చేరువ‌య్యేలా డీఎస్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారా లేదా.. ఇలాంటి అంశాల‌పై ఓ క‌న్నేసి ఉంచిన‌ట్టు స‌మాచారం. డీఎస్ పెద్ద కుమారుడు తీరు కూడా ఈ నిఘాకు ఓ కార‌ణంగా చెప్పుకోవ‌చ్చు. ఆయ‌న పెద్ద కుమారుడు సంజ‌య్ ప్ర‌స్తుతం తెరాస‌లోనే ఉన్నారు. అయితే, ఈ మ‌ధ్య ఆయ‌న పార్టీ కార్య‌క‌లాపాల‌కు దూరంగా ఉంటున్నారు. ఎందుకంటే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి తీరాల‌ని ఆయ‌న ఫిక్స్ అయిపోయారట‌. సిటింగుల‌కు మాత్ర‌మే టిక్కెట్లు ఇస్తా అంటూ కేసీఆర్ ప్ర‌క‌టించాక‌, ఆయ‌న ఏర్పాట్ల‌లో ఆయ‌న ఉన్నార‌ట‌! ఆ ఏర్పాట్లు ఏంట‌నేదానిపై కూడా గులాబీ వ‌ర్గం నిఘా పెట్టింద‌ని చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉండ‌గా పెద్ద దిక్కుగా నిలిచిన డీఎస్ ప్ర‌స్తుత ప‌రిస్థితి ఇలా మారింది. కుమారులను క‌ట్ట‌డి చేయ‌లేక‌పోతున్నార‌నీ, ఇంట్లో ఇంత జ‌రుగుతున్నా త‌న‌కేం తెలియ‌ద‌న్న‌ట్టుగా ఆయ‌న ఎలా ఉంటున్నార‌నే అసంతృప్తి తెరాస అధినాయ‌క‌త్వంలో పెరుగుతోంద‌ని స‌మాచారం. మ‌రి, ఈ నేప‌థ్యంలో డీఎస్ ఏం చేస్తార‌నేది వేచి చూడాలి.


 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com