కాషాయం రంగులో అన్నాడీఎంకే హోర్డింగ్‌లు

  Written by : Suryaa Desk Updated: Thu, Oct 12, 2017, 06:51 PM
 

తమిళనాట రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికారంలో ఉన్న అన్నాడీఎంకేలో చీలికలు ఏర్పడటం మళ్లీ విలీనమవడం, పార్టీనుంచి శశికళ, దినకరన్‌లను బహిష్కరించడం.. ఇలా అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాజాగా తమిళ రాజకీయాల్లో మరో ఆసక్తికర ఘటన జరిగింది. అధికార పార్టీ ఏర్పాటుచేసిన హోర్డింగ్‌లు కాషాయ రంగులో కన్పించాయి. దీంతో అన్నాడీఎంకే.. భాజపాతో పొత్తు పెట్టుకుంటోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.


రాష్ట్రాంలో ప్రబలుతున్న డెంగీ జ్వరాలపై అవగాహన కల్పించేందుకు అన్నాడీఎంకే ప్రభుత్వం హోర్డింగ్‌లు ఏర్పాటుచేసింది. అయితే సాధారణంగా అన్నాడీఎంకే ఏ కార్యక్రమం చేపట్టినా ఆకుపచ్చ రంగునే ఉపయోగిస్తుంది. కానీ ఈ హోర్డింగ్‌లకు కాషాయపు రంగు ఉండటంతో చర్చనీయాంశంగా మారింది. దీంతో అన్నాడీఎంకే భాజపాతో పొత్తుకు ఇది సంకేతమని ప్రతిపక్ష డీఎంకే ఆరోపిస్తోంది. మరోవైపు ఉపముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం నేడు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. దీంతో ఈ వూహాగానాలు మరింత బలపడుతున్నాయి. అన్నాడీఎంకే భాజపాకు లొంగిపోయిందని డీఎంకే నేత స్టాలిన్‌ విమర్శలు చేశారు.


అయితే ఈ ఆరోపణలను అధికార పార్టీ కొట్టిపారేసింది. భాజపాతో ఎలాంటి పొత్తు లేదని.. అంతేగాక హోర్డింగ్‌లలో వాడిన రంగు కాషాయం కాదని ఎరుపు రంగు అని పేర్కొంది. ప్రజల దృష్టిని తొందరగా ఆకర్షించేందుకే ఈ రంగును ఉపయోగించినట్లు తెలిపింది. మరోవైపు పన్నీర్‌ కూడా ఇదే మాట చెప్పారు. ప్రధానితో ఎలాంటి రాజకీయ చర్చలు జరపలేదని.. ఇది మర్యాదపూర్వక సమావేశం మాత్రమేనని తెలిపారు.