ఒక్క రోజు రాయబారులుగా మహిళలు

  Written by : Suryaa Desk Updated: Thu, Oct 12, 2017, 06:53 PM
 

శంకర్‌ దర్శకత్వంలో అర్జున్‌ హీరోగా తెరకెక్కిన ‘ఒకే ఒక్కడు’ చిత్రం సినీ ప్రేక్షకులను ఎంతగా అలరించిందో తెలిసిందే. అందులో ఒక్కరోజు ముఖ్యమంత్రి కావడం అనేది ఆ చిత్రంలో ఓ కీలక మలుపు. ఇప్పుడు ఆ సినిమా ప్రస్తావన ఎందుకంటే.. బుధవారం ‘అంతర్జాతీయ బాలికల దినోత్సవం’ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహించారు. ఆ చిత్రంలో మాదిరిగానే బుధవారం భారత అమ్మాయిలు ఒక్కరోజు వివిధ దేశాల భారత రాయబారులుగా వ్యవహరించారు.రుద్రాలి పాటిల్‌ మహారాష్ట్రకు చెందిన విద్యార్థిని నోయిడాలో లా చదువుతోంది. బుధవారం బ్రిటిష్‌ రాయబారిగా ఆ పదవిలో కొనసాగింది. బబిత ఫ్రాన్స్‌ దౌత్యవేత్తగా, హీనా అమెరికా హైకమిషనర్‌గా, మధుజా నిగం న్యూజిలాండ్‌కి, వీరితో పాటు మరో 19 మంది అమ్మాయిలు ఒక్కరోజు రాయబారులుగా బుధవారం దౌత్య కార్యలయంలో ఆ పదవిలో కొనసాగారు. బుధవారం నిర్వహించిన సమావేశాల్లో పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 1000 మంది అమ్మాయిలు రాయబారులు, సీఈవోలు, అధ్యక్షులు, ప్రిన్సిపల్స్‌, డైరక్టర్స్‌గా వ్యవహరించారు. ‘ మహిళల ప్రాధాన్యతను తెలియజేశారు. ఒక్క రోజు బ్రిటిష్‌ రాయబారిగా పదవిలో ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది.’ అని రుద్రాలి పాటిల్‌ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.‘ మహిళలు దేన్నైనా సాధించగలరని నేను నమ్ముతాను. కానీ వారికి సహాయాన్ని అందించే వారే కరవయ్యారు.’ అని 18 ఏళ్ల బబిత తెలిపింది. ‘వారి హక్కుల్ని, ప్రాధాన్యతని, అంకితభావాన్ని, శక్తిని తెలియజేసేందుకు ఇలా చేశాం.’ అని భారత కార్యనిర్వహణాధికారి భాగ్యశ్రీ వెల్లడించారు.