ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్వతంత్ర అభ్యర్థిని గెలిపిస్తా: విశాల్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 07, 2017, 08:50 AM

ఆర్కేనగర్‌లో తన నామినేషన్‌ తిరస్కరణకు గురైన నేపథ్యంలో ఆ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థికి మద్దతిచ్చి గెలిపిస్తానని నటుడు విశాల్‌ ప్రకటించారు. ఆర్కేనగర్‌ ఉప ఎన్నికలో పోటీ చేయడానికి నటుడు విశాల్‌ సమర్పించిన నామినేషన్‌ను మొదట ఎన్నికల అధికారులు తిరస్కరించినట్లు ప్రకటించగా విశాల్‌ నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనతో చర్చించిన అధికారులు ఆ నామినేషన్‌ను స్వీకరించినట్లు ప్రకటించారు. మళ్లీ రాత్రికి నాటకీయ పరిణామాలు తెరపైకి వచ్చాయి. చివరకు ఆయన నామినేషన్‌ తిరస్కరణకు గురైనట్లు అధికారికంగా ప్రకటించారు. దీనిపై ఆయన బుధవారం చెన్నైలో విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల అధికారి తన నామినేషన్‌ను స్వీకరించినట్లు చెప్పిన విషయంపై వీడియో ఆధారం తనవద్ద ఉందన్నారు. ఆయన చేసిన ప్రకటనపై అందరూ హర్షం వ్యక్తం చేస్తూ కరతాళ ధ్వనులు చేశారని తెలిపారు. ప్రజలకు మంచి చేయాలని భావిస్తే ఇన్ని సమస్యలు వస్తాయని అనుకోలేదని, సినిమాలోని సన్నివేశాల తరహాలో ప్రతి నిమిషానికి ట్విస్టులు ఎదురయ్యాయన్నారు.


 


 ప్రజలకు మంచి చేయాలనుకొనేవారికి ఇదే పరిస్థితా.. ప్రజాస్వామ్య దేశంలో స్వతంత్ర అభ్యర్థి పోటీ చేయకూడదా..? అంటూ విమర్శించారు. గతంలో ఓటర్లకు నగదు పంపిణీ కారణంగా ఆర్కేనగర్‌లో జరగాల్సిన ఉప ఎన్నిక రద్దయిందని, ఈసారి బెదిరింపులకు పాల్పడే స్థాయిలో పరిస్థితి మరింత దిగజారిందని చెప్పారు. ట్విస్టులపై ట్విస్టులతో పరిస్థితి గందరగోళంగా మారిందని, దేనికోసం తన నామినేషన్‌ను తిరస్కరించారనే విషయమే అర్థం కాలేదన్నారు. తనను చూసి ఎందుకు భయపడుతున్నారు.. ఎన్నికల సంఘం వెనుక ఎవరు ఉన్నారనే విషయాలు తనకు తెలియలేదన్నారు. తన నామినేషన్‌ తిరస్కరణ వెనుక మధుసూదన్‌ ఉన్నారా అనే విషయాన్ని ఆయన్నే మీడియా ప్రతినిధులు అడిగి తెలుసుకోవాలని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. స్వతంత్య్ర అభ్యర్థిగా పోటిచేసే ఓ యువకుడికి తన మద్దతు తెలిపి అతడిని గెలిపిస్తానని, అతని ద్వారా ఈ ప్రజలకు మంచి చేస్తానని విశాల్‌ ప్రకటించారు. అంతకుముందు దానిని తిరస్కరించినట్లు చెప్పినా విశాల్‌ తరఫు వాదనలు విన్న తర్వాత ఆమోదించినట్లు చెప్పిన అధికారులు పేర్కొన్నారని.. 


 


తర్వాత ఎందుకు తిరస్కరించారో వివరణ ఇవ్వాలన్నారు. ఇలా తిరస్కరణ.. ఆమోదం.. తిరస్కృతి అంటూ ఎన్నికల అధికారులు గందరగోళం సృష్టించారని, దీనినిబట్టి చూస్తే ఎన్నికల సంఘంపై ఒత్తిడి ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ఈ వ్యవహారం ఎన్నికల సంఘంపై ప్రజలకున్న నమ్మకాన్ని పోగొడుతుందని, ఎన్నికల ప్రక్రియ అనేది కంటితుడుపు చర్యలనే భావనను ప్రజల్లో కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. ఇది ప్రజాస్వామ్యానికి ముప్పుగా పరిణమిస్తుందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా సేలంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ముత్తరసన్‌ మాట్లాడుతూ ఆర్కేనగర్‌లో ప్రజాస్వామ్యం మేరకు ఎన్నికలు జరిగితే డీఎంకే విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఎన్నికలను ఎన్నికల సంఘం సజావుగా నిర్వహించగలదా..? అనే అనుమానం కలుగుతోందన్నారు. విశాల్‌ నామినేషన్‌ వ్యవహారంలో పెద్ద గందరగోళం ఏర్పడిందని, ఎవరి ఒత్తిడికో లొంగి ఆయన నామినేషన్‌ను తిరస్కరించినట్లు తెలుస్తోందన్నారు. ఎన్నికల సంఘంపై ప్రజలు నమ్మకాన్ని కోల్పోతున్నారని, ఇదే పరిస్థితి కొనసాగితే వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. డీఎంకే అభ్యర్థికి మద్దతుగా ఒకట్రెండు రోజుల్లో ఆర్కేనగర్‌లో ప్రచారం చేయనున్నట్లు ఆయన చెప్పారు. వేర్పాటువాద శక్తులకు వ్యతిరేకంగా గళం విప్పుతూనే ఉంటామని ఉద్ఘాటించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com