కొండలన్నీ అంజన్నకే..

  Written by : Suryaa Desk Updated: Fri, Jan 12, 2018, 04:42 PM
 

జగిత్యాల : కొండగట్టు గట్టలన్నీ నేటి నుంచి అంజన్నకే చెందనున్నాయి. కొండగట్టు చుట్టుపక్కల 333.01ఎకరాల భూములను ఆలయానికి చొప్పదండి ఎమ్మెల్యే బొడిగ శోభ, కలెక్టర్ శరత్ ఈ రోజు అందించారు. దీంతో ఆలయ విస్తరణ, అభివృద్దికి తొలి అడుగు పడినట్లేనని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.


గుట్ట మీద స్థలాభావం ఇక తీరనుందని చెబుతున్నారు. దేవస్థానానికి గుట్టపైన 22, కింద 22 ఎకరాల భూములున్నాయి. పైన స్థలం సరిపోక పార్కింగ్, ఇతర నిర్మాణాలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గుట్ట పరిసర ప్రాంతాల రెవెన్యూ భూములు ఆలయానికి స్వాధీనం చేయాలనే డిమాండ్ ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నది. చొప్పదండి ఎమ్మెల్యే బొడిగ శోభ ప్రత్యేక చొరవతో కొండగట్టు గుట్టకు ఆనుకొని ఉన్న 333.01ఎకరాల రెవెన్యూ భూములను అంజన్నకు అప్పగించేందుకు కలెక్టర్ శరత్ నిర్ణయించి పత్రాలను సిద్ధం చేశారు.


 


కొండగట్టు ఆలయంలో ఎమ్మెల్యే శోభ, కలెక్టర్ శరత్‌లు భూముల ధారదత్తం పత్రాలను ఈ రోజు స్వామి వారికి అప్పగించారు. దీంతో సత్రాల నిర్మాణం, రోడ్లు, పార్కింగ్ స్థలాల ఏర్పాటు, నీటి వసతి కోసం రిజర్వాయర్ల నిర్మాణాలకు మార్గం సుగమమైంది. ఎన్నో ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న రోప్ వే నిర్మాణానికీ స్థల సేకరణ ఇబ్బంది తొలగిపోయింది. ఆలయ పరిసర ప్రాంతాల్లో పార్క్‌లు, మూలికా వనం, పూల తోటలు పెంచేందుకు భూములు అందుబాటులోకి రానున్నాయి.