తమిళ సూపర్‌స్టార్స్‌తో పీవీ సింధు సందడి

  Written by : Suryaa Desk Updated: Sat, Jan 13, 2018, 09:01 AM
 

భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి, తెలుగు తేజం పీవీ సింధు తమిళ సినీ తారలతో సందడి చేసింది. సూర్య, అజిత్ తదితరులతో సింధు దిగిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఒలింపిక్‌ పతక విజేత పీవీ సింధు ప్రస్తుతం ప్రిమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌లో చెన్నై స్మాషర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో సింధు జట్టు సెమీస్‌కు చేరుకోలేకపోయింది. 2 రోజుల కిందట చెన్నైలో లీగ్‌ పోటీలు జరిగాయి. సింధు ప్రాతినిధ్యం వహించిన చెన్నై స్మాషర్స్‌ మ్యాచులను వీక్షించడానికి హీరో సూర్య కుటుంబ సమేతంగా విచ్చేశాడు.


మ్యాచ్‌ ముగిసిన తర్వాత సింధు.. సూర్య, జ్యోతిక, వారి పిల్లలతో ఫొటోలు దిగింది. అదేవిధంగా అజిత్‌-షాలినితో కూడా కలిసి ఫొటోలకు ఫోజిచ్చింది. ఈ ఫొటోలను సింధు తాజాగా తన ఇన్‌స్టాగ్రాం, ట్విటర్‌ అకౌంట్ల ద్వారా అభిమానులతో పంచుకుంది. సూర్య హీరోగా తెరకెక్కిన ‘గ్యాంగ్’ సినిమా శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొచ్చి సందడి చేస్తున్న విషయం తెలిసిందే.పీబీఎల్‌లో హైదరాబాద్‌ హంటర్స్‌, ఢిల్లీ డాషర్స్‌, అహ్మదాబాద్‌ స్మాష్‌ మాస్టర్స్‌, బెంగళూరు బ్లాస్టర్స్‌ జట్లు సెమీస్‌కు దూసుకెళ్లాయి. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియం వేదికగా.. ఆదివారం ఫైనల్స్‌ జరగనున్నాయి.