నూతన పార్కింగ్ పాలసీపై మంత్రి కేటీఆర్ సమీక్ష

  Written by : Suryaa Desk Updated: Sat, Jan 13, 2018, 09:08 AM
 

హైదరాబాద్: నూతనంగా ప్రకటించిన పార్కింగ్ పాలసీపై హెచ్‌ఎండీఏ అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రైవేట్ పార్కింగ్‌కు అవకాశాలపై ప్రచారం కల్పించాలని అధికారులను ఆదేశించారు. మల్టీలెవల్ పార్కింగ్‌కు టెండర్లు పిలవాలన్నారు. నగరంలో కనీసం వంద ఫుట్ ఓవర్ బ్రిడ్జిల పనులు ప్రారంభించాలన్నారు. నగరంలో వచ్చే ఏడాది కాలంపాటు ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు కట్టింగ్‌కు అనుమతులివ్వొద్దని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు. మున్సిపాలిటీల పరిధిలో పాత, కాలం చెల్లిన పైపులను మార్చేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.


మిషన్ భగీరథ అర్బన్ కార్యక్రమంలో చేపట్టిన పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తయ్యేలా పర్యవేక్షించాలన్నారు. రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలకు ప్రత్యేక నిధులిచ్చామన్నారు. ఉప్పల్ - శిల్పారామం పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. మున్సిపాలిటీల్లో భవన నిర్మాణ అనుమతులకు నిర్ణీత గడువు పెట్టుకోవాలన్నారు. గడువులోగా అనుమతులివ్వకుంటే టీఎస్ ఐపాస్ అనుమతుల మాదిరిగా ఆటోమేటిగ్గా అనుమతులు వచ్చేలా చూడాలన్నారు. భవన నిర్మాణాల అనుమతుల ప్రక్రియలో ఆలస్యానికి కారణమయ్యే అధికారులకు జరిమానాలు విధించే పద్ధతిని ప్రవేశపెట్టాలని మంత్రి ఆదేశించారు.


Telangana E-Paper