రోడ్డు ప్రమాదం.. ఐదుగురు రెజ్లర్ల దుర్మరణం

  Written by : Suryaa Desk Updated: Sat, Jan 13, 2018, 11:50 AM
 

ఛాంపియన్లు కావాలన్న వారి ఆశలు ఆవిరయ్యాయి. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు దూసుకొచ్చి రెజ్లర్లను బలితీసుకుంది. మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు రెజ్లర్లు సహా ఆరుగురు మృత్యువాతపడ్డారు. రెజ్లర్లు స్థానిక పోటీలు ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..


సంగ్లీలోని అవుంధ్‌ గ్రామంలో ఇటీవల లోకల్‌ రెజ్లింగ్‌ పోటీలు జరిగాయి. కుందల్‌ ప్రాంతానికి చెందిన రెజ్లర్లు ఈ పోటీలు ముగించుకుని తిరిగి వెళ్తుండగా.. రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వారు ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వేగంగా వస్తున్న ట్రాక్టర్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఏడుగురు గాయపడ్డారు.


మృతుల్లో ఐదుగురు రెజ్లర్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్‌ డ్రైవర్‌ పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.