విద్యార్థిగా మారిన చిన్నమ్మ శశికళ

  Written by : Suryaa Desk Updated: Sat, Jan 13, 2018, 11:51 AM
 

బెంగళూరు: అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి చిన్నమ్మ శశికళ విద్యార్థినిగా మారిపోయారు. జైల్లో ఆమె కన్నడ నేర్చుకుంటున్నారు. పరప్పణ అగ్రహారంలోని సెంట్రల్‌ జైలులో ఖైదీల కోసం ప్రత్యేకంగా అడల్ట్‌ లిటరసీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే కన్నడ భాష రాయడం, చదవడం నేర్పిస్తున్నారు. ఈ తరగతులకు శశికళ కూడా హాజరవుతున్నట్లు జైలు అధికారులు చెబుతున్నారు. అంతేకాదు.. కంప్యూటర్‌ తరగతులకు కూడా ఆమె హాజరువుతున్నారట.


ఇదే జైలులో ఉన్న శశికళ బంధువు జె.ఇళవరసితో కలిసి కన్నడ నేర్చుకుంటున్నట్లు సిబ్బంది తెలిపారు. అయితే.. కన్నడ మాట్లాడటం మాత్రం రాలేదని.. కానీ ఆమె బాగా రాయగలుగుతున్నారట. ఈ తరగతులకు హాజరైన వారికి శిక్షణ ముగిసిన తర్వాత ధ్రువీకరణ పత్రాలు అందజేయడం జరుగుతోంది. పుస్తకాలు చదవడంపై కూడా శశికళ ఆసక్తి చూపిస్తున్నట్లు జైలు లైబ్రరీ సిబ్బంది తెలిపారు. ఇప్పటి వరకు అక్కడ కేవలం పురుషులకు మాత్రమే గ్రంథాలయం ఉంది. మహిళల కోసం జైలులో ప్రత్యేకంగా లైబ్రరీని ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.