సీజేఐ నివాసం వద్ద ప్రిన్సిపల్ కార్యదర్శి

  Written by : Suryaa Desk Updated: Sun, Jan 14, 2018, 11:43 AM
 

సుప్రీం కోర్టు న్యాయమూర్తుల ప్రెస్ మీట్ తో ఆరంభమైన సంక్షోభం, సంచలనం ఇంకా సమసి పోలేదు. తాజాగా నిన్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి నివాసం వద్ద ప్రధాని మోడీ ప్రిన్సిపల్ కార్యదర్శి కనిపించడం విమర్శలకు తావిచ్చింది. సుప్రీం పాలనా వ్యవహారాలలో కేంద్రం జోక్యం పెచ్చరిల్లిందనడానికి ఇది తాజా ఉదాహరణ అని కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. అయితే దీనిపై ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ఇంత వరకూ ఎటువంటి స్పందనా రాలేదు. ఇలా ఉండగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) దీపక్ మిశ్రా నివాసానికి వెళ్లిన ప్రధాని ప్రిన్సిపల్ కార్యదర్శి ఆయనను కలుసుకోలేదు. అయినప్పటికీ సీజేఐ నివాసం వద్ద ఆయన ఎందుకు ఉన్నారని కాంగ్రెస్ నిలదీస్తున్నది. కాగా ఎపీజే అబ్దుల్ కలాం రోడ్ లోని తన కార్యాలయం నుంచి బయలుదేరిన ప్రధాని ప్రిన్సిపల్ కార్యదర్శి నృపేంద్రమిశ్రా మార్గ మధ్యంలో ఉన్న సీజేఐ నివాసం వద్ద ఆగారు. అయితే సీజేఐ సందర్శకులను కలుసుకోవడానికి అంగీకరించకపోవడంతో గేట్ వద్ద నుంచే వెనుదిరిగారు.నూతన సంవత్సర శుభాకాంక్షల గ్రీటింగ్ కార్డు ఇచ్చేందుకే నృపేంద్ర మిశ్రా సీజేఐ నివాసానికి వెళ్లారని, ఆయన సందర్శకులను కలుసుకోవడం లేదని తెలుసుకుని సీజేఐ సిబ్బందికి గ్రీటింగ్ కార్డు అందజేసి వెనుదిరిగారని పీఎంవో పిఎంవో వర్గాలు చెబుతున్నాయి.  సీజేఐ నివాసం వద్ద నృపేంద్ర మిశ్రా కనీసం కారు కూడా దిగలేదని ఆ వర్గాలు తెలిపాయి.