తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా రాజకీయ నాయకులు, సెలెబ్రిటీలు, సామాన్యులు ఇలా అందరూ పలు వేదికల్లో శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రధాని మోదీ సైతం ట్విటర్లో కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ఆయురారోగ్యాలతో పాటు ఆనందకరమైన జీవితం గడపాలని ఆకాంక్షించారు. అటు సోషల్ మీడియాలో అయితే అభిమానం పెల్లుబికింది. ముఖ్యమంత్రిగారి జన్మదినం సందర్భంగా ఫ్లెక్సీలు, జెండాలు వంటి హంగామాలేం చేయకూడదని రెండు రోజుల క్రితమే కేసీఆర్ కుమారుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్లో పేర్కొన్నారు. కశ్మీర్ పుల్వామా ఉగ్రదాడిలో 40 మందికి పైగా జవాన్లు ప్రాణాలు కోల్పోవడంతో.. పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని కేసీఆర్ నిర్ణయించారు. ఆ మేరకు తన జన్మదిన వేడుకలు నిర్వహించరాదంటూ పార్టీశ్రేణులకు కూడా పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కేసీఆర్కు ప్రముఖుల నుంచి అభినందనలు సోషల్ మీడియాలో వెల్లువలా వస్తున్నాయి.