వేసవికాలం ముగిసి వానాకాలంలోకి అడుగిడాల్సి ఉన్నా రుతు పవనాల రాక ఆసల్యం కావటంతో ఇంకా ఎండ తీవ్రత తెలంగాణాలో అలానే ఉంది. అయితే గత నెలలో వీచిన వడగాడ్పులు తెలంగాణ ఎక్సైజుకు కాసులవర్షం కురిపించాయి. తెలంగాణలో బీర్ల అమ్మకాలు తన పాత రికార్డులను బద్దలు కొడుతూ సరికొత్త రికార్డులను నమోదు చేసాయి. ఈ వేసవి కాలం మందుబాబులు తాము నిత్యం సేవించే బ్రాంది, విస్కీ వంటి వాటిని పక్కన పెట్టి చల్లని బీర్లవైపు మొగ్గు చూపడంతో. . మే నెలలోనే 61 లక్షల కేసుల బీర్లను తెలంగాణ రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ అమ్మింది. దీనిని బట్టి రాష్ట్రంలో బీరు అమ్మకాలు ఏ రేంజ్ లో సాగాయో అర్ధం చేసుకోవచ్చు. గత ఏడాది మే నెలలో 57 లక్షల కేసులు అమ్ముడుపోగా ఈ ఏడాది ఏప్రిల్ లో 53 లక్షల కేసుల బీర్లను మద్యం ప్రియులు ఊది పారేసారు.