పిల్లల అక్రమ రవాణాదారులపై కఠిన చర్యలు: రాచకొండ సీపీ

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 16, 2019, 04:20 PM
 

హైదరాబాద్: పిల్లలను అక్రమ రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా బాలాపూర్‌లోని గాజుల పరిశ్రమల్లో పనిచేస్తున్న పిల్లలను రాచకొండ పోలీసులు కాపాడారు. పిల్లలతో బలవంతంగా పనిచేయిస్తున్న బీహార్‌కు చెందిన 11 మందిపై కేసు నమోదు చేశారు. ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. మరో నలుగురు వ్యక్తులు పరారీ ఉన్నారు. రాచకొండ సీపీ మహేష్ భగవత్ మాట్లాడుతూ.. ప్రధాన నిందితుడు అస్లాం బీహార్‌లోని పిల్లను తీసుకొచ్చి తెలంగాణలో వెట్టిచాకిరి చేయిస్తున్నట్లు తెలిపారు. పిల్లలకు ఇబ్బంది లేకుండా బీహార్‌లోని సంబంధిత జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి 54 మంది పిల్లలను స్వస్థలాలకు పంపించినట్లు చెప్పారు. ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా 15 రోజుల వ్యవధిలో 176 మంది పిల్లలను వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించినట్లు వెల్లడించారు. ఈ నెల చివరి వరకు ముస్కాన్ ఆపరేషన్ కొనసాగుతుందని పేర్కొన్నారు.