కాళేశ్వ‌రం ప్రాజెక్టు జ‌లాల‌పై ట్విట‌ర్‌లో స్పందించిన కేటీఆర్‌

  Written by : Suryaa Desk Updated: Wed, Jul 17, 2019, 11:15 AM
 

 ప్రాణహిత నుంచి కొనసాగుతున్న వరదనీటితో మేడిగడ్డ బరాజ్, అక్కడి నీటిని కన్నెపల్లి పంప్‌హౌస్‌నుంచి నిరంతరాయంగా ఎత్తిపోస్తుండటంతో అన్నారం బరాజ్ భారీ జలాశయాలను తలపిస్తున్నాయి. మేడిగడ్డ బరాజ్‌లో మంగళవారం సాయంత్రానికి 7.50 టీఎంసీలు, అన్నారం బరాజ్‌లో 5 టీఎంసీల నీరు చేరుకున్నది. ఈ సంద‌ర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు జలాలపై టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్‌లో స్పందించారు. 


 


కేటీఆర్ ఏమ‌న్నారంటే.. 'కన్నెపల్లి పంపుహౌస్‌లో నీటి ఎత్తిపోతల జరుగుతోంది. ఇంత తక్కువ వర్షాలు పడుతున్న కాలంలో ప్రాణహిత నదిలో వస్తున్న వరదనీటిని 10 రోజుల్లో 5 మోటార్ల ద్వారా ఎత్తిపోసి 11 టీఎంసీలు ఒడిసిపట్టాం. గోదావరిలో తక్కువ వరద ఉన్నప్పుడే 11 టీఎంసీలు నిల్వచేయడం జరిగింది. ఇప్పటికే పట్టిన నీటితో లక్షన్నర ఎకరాలకు నీరు ఇవ్వొచ్చు. ఇది ప్రారంభం మాత్రమే.. వర్షాలు పడి, వరద పెరిగితే అన్ని మోటార్లు మొదలవుతాయి. అన్ని మోటార్లు ప్రారంభమైతే తెలంగాణలో బీడు భూములు సస్యశ్యామలం అవుతాయి. సీఎం కేసీఆర్ దార్శనికత వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లలోనే సాకారమైంది. ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి కావడం వల్ల తెలంగాణకు చేకూరిన లబ్ధి ఇది. కాళేశ్వరం జలాలతో హైదరాబాద్ నీటి అవసరాలు కూడా తీరుతాయి. చెన్నై తరహా నీటి కష్టాలు హైదరాబాద్‌కు ఎప్పుడూ రాకుండా చూసుకోవచ్చు. దేశంలోని చాలా మెట్రోపాలిటన్ నగరాల్లో తాగునీటి సమస్య తీవ్రస్థాయిలో ఉందని హైదరాబాద్‌కు అలాంటి పరిస్థితి ఎదురయ్యే ఛాన్సే లేదని' కేటీఆర్ పేర్కొన్నారు.