ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీది పెద్ద ప్లానే..!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 17, 2019, 11:43 AM

బెంగాల్ ఒక‌ప్పుడు క‌మ్యూనిస్టుల‌కు కంచుకోట. ఆ కోట‌ను బ‌ద్ద‌లు కొట్టింది బెంగాల్ సీఎం మ‌మ‌త బెన‌ర్జీ. కేవ‌లం ఆమె కృషి వ‌ల్లే త్రుణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ బెంగాల్లో రెండుసార్లు జెండా ఎగ‌రేసి క‌మ్యూనిస్టుల‌ను దాదాపుగా క‌నుమ‌రుగు చేసింది. అలాంటి బెంగాల్‌లో ఇప్పుడు బీజేపీ పాగా వేయాల‌ని చూస్తోంది. ఇటీవ‌ల జ‌రిగిన పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో బీజేపీ ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర కాగ‌లిగింది. మొత్తం 42 ఎంపీ సీట్ల‌లో 18 సీట్ల‌ను ఎగ‌రేసుకుపోయి దీదీ ఆధిప‌త్యానికి స‌వాలు విసిరింది. ఈ నేప‌థ్యంలో అక్క‌డ అవ‌లంబించిన ఫార్ములాను ఏపీ, తెలంగాణ‌లోనూ అమ‌లు చేయాల‌ని అలాగైతేనే ద‌క్షిణాదిన పార్టీని అధికారంలోకి తీసుకురాగ‌ల‌మ‌ని బీజేపీ అధిష్టానం బ‌లంగా నమ్ముతోంది. బెంగాల్ ప్ర‌జ‌ల ప్ర‌ధాన స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేసింది. ఫ‌లితంగా ప్ర‌జ‌లు ఆద‌రించారు. పైగా మ‌మ‌త ప్ర‌భుత్వం ఒంటెద్దు పోక‌డ‌లు కూడా ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త పెరిగేలా చేసాయి. వీటిని ప్ర‌జాక్షేత్రంలో ఎత్తిచూప‌డంలో బీజేపీ స‌క్సెస్ అయింది. స‌రిగ్గా ఇదే ఫార్ములా తెలంగాణ‌, ఏపీల్లోనూ స‌త్ఫ‌లితాల‌ను ఇస్తుంద‌ని పార్టీ న‌మ్ముతోంది.


ఏపీ, తెలంగాణ‌లో ఇక దూకుడే..


వాస్త‌వానికి ఉత్త‌రాది, హిందీ పార్టీగా గుర్తింపు పొందిన బీజేపీకి ద‌క్షిణాదిన మొద‌టి నుంచి అంత‌గా ప‌ట్టు లేదు. ఎంతోకొంత‌ తెలంగాణ‌లో అవ‌కాశం ఉంది. ప‌దేళ్లుగా సీన్ మారింది. క‌ర్ణాట‌క‌లోనూ పార్టీ క్ర‌మంగా బ‌ల‌ప‌డింది. రెండుసార్లు బీజేపీ అభ్య‌ర్థి సీఎం కాగాలిగారు. ఉమ్మడి ఏపీలో క‌మ‌ల‌నాథులు పూర్తిగా తెలుగుదేశంపై ఆధార‌ప‌డ్డా.. తెలంగాణ‌లో క్ర‌మంగా పుంజుకుంటుంది. మొన్న జ‌రిగిన ఎంపీ ఎన్నిక‌ల్లో పార్టీకి ఏకంగా 4 పార్ల‌మెంటు సీట్లు రావ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌నం. అందుకే, బీజేపీ తెలంగాణ‌లో దూకుడు పెంచింది. మొన్న‌టిదాకా ఏపీలో బీజేపీ – వైసీపీ అవ‌గాహ‌న‌తో ఉన్నాయ‌నుకున్నారంతా. ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ వైసీపీపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసారు. త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌పై వైసీపీ దాడులు చేస్తోంద‌ని ధ్వ‌జ‌మెత్తాడు. ఈ వ్యాఖ్య‌ల‌తో కేంద్రం వ్యూహం ఏంటో అర్థ‌మైంది. రికార్డు మెజారిటీతో ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన మోదీ.. ఇక ఏ పార్టీని బ‌తిమాలాల్సిన ప‌ని లేదు. ఇప్పుడు ఆయ‌న ముందున్న‌వి రెండే ల‌క్ష్యాలు. ఒక‌టి ఎన్నిక‌ల మేనిఫెస్టో అమ‌లు, రెండు పార్టీని ద‌క్షిణాదిన విస్త‌రించ‌డం. మొద‌టి ప‌నిని మోదీ చూసుకుంటున్నారు. రెండో ప‌నిని అమిత్ షాకు అప్ప‌గించారు. ఇందులో భాగంగానే ఏపీలో బీజేపీకి భారీగా చేరిక‌లు ఉంటున్నాయి. త్వ‌ర‌లోనే తెలంగాణ‌లోనూ ఉంటాయ‌ని బీజేపీ ధీమాగా ఉంది. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌పై బ‌లంగా పోరాడ‌టం, ఉద్య‌మాలు చేయ‌డం, కొత్త ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించ‌డం, రాజ‌కీయంగా దూకుడుగా వ్య‌వ‌హ‌రించ‌డం ఇదే ఫార్ములా బెంగాల్‌లో ఆచ‌రించి విజ‌యం సాధించారు. అదే ఆయుధాన్ని ఏపీ, తెలంగాణ‌లోనూ వాడుతున్నారు. మ‌రి ఫ‌లితాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com