క‌మ‌లం చాటుకు కొండా దంప‌తులు? అయితే...

  Written by : Suryaa Desk Updated: Wed, Jul 17, 2019, 11:44 AM
 

 మాజీ మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త మాజీ ఎమ్మెల్సీ మురళిలు క‌మ‌లం చెంత‌కు చేరుతున్నారా? అంటే అవున‌నే స‌మాధానం ఇప్పుడు ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో వినిపిస్తోంది.  గ‌తంలో కాంగ్రెస్‌లో మంత్రిగా ప‌నిచేసి, ఆపై జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వైసిపి పెట్ట‌గానే అందులో చేరి, తదుప‌రి స్వ‌ర్ణ తెలంగాణ అన్న కేసీఆర్ పిలుపందుకుని టిఆర్ ఎస్‌లో చేరిన విష‌యం తెలిసిందే. అయితే   తమ కూతురికి భూపాలపల్లి టికెట్ ఇవ్వాల‌న్న డిమాండ్‌కు గులాబి పార్టీ అంగీక‌రించ‌క‌పోవ‌టంతో ఆమె  అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పరకాల నుంచి పోటీ చేసి  ఓడిపోయారు. అయితే తాజాగా కాంగ్రెస్‌లో జ‌రుగుతున్న ప‌రిణామాలు, క్ర‌మ‌క్ర‌మంగా పార్టీ బ‌ల‌హీన ప‌డుతున్న ప‌రిస్థితి చూసి టిఆర్ ఎస్‌కు ధీటుగా ఎదుగుతున్న బిజెపిలో చేర‌ట‌మే త‌న ముందు ఉన్న ప్ర‌త్యామ్నాయంగా ఆమె భావిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. అయితే  భూపాలపల్లి నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల‌లో త‌న కుమార్తెకు సీటు ఖ‌రారు చేయాల‌ని, ఇప్ప‌టి నుంచే ఆ నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీని ప‌టిస్టం చేస్తామ‌న్న కండిష‌న్ క‌మ‌ల‌నాథుల ముందు సురేఖ ఉంచిన‌ట్టు స‌మాచారం. అయితే బిజెపిలోకి చేరేందుకు గ‌త‌ ఎన్నికల్లో  కాంగ్రెస్ నుంచి ఇదే నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేసి ఓడిపోయిన గండ్ర సత్యనారాయణ  ఏర్పాట్లు చేసుకుంటునే  భూపాలపల్లి టికెట్‌ కోసం పట్టుబడుతున్నార‌ట‌. ఈ విష‌య‌మై క‌మ‌ల‌నాధులు ఓ కొలిక్కి వ‌స్తే కానీ సురేఖ ప‌రివారం బిజెపిలో చేరే విష‌యంలో ఉన్న‌ సందిగ్ధత  తొల‌గి పోదు.


 


 


 


Telangana E-Paper