జూలై 21 లేదా 22న చంద్రయాన్-2 రీ లాంచ్

  Written by : Suryaa Desk Updated: Wed, Jul 17, 2019, 03:07 PM
 

టెక్నికల్ కారణాలతో చంద్రయాన్-2 ప్రయోగం నిలిచిపోయిన సంగతి తెలిసిందే. మళ్లీ ఎప్పుడు చంద్రయాన్-2 ప్రయోగం నిర్వహిస్తారు అనే దానిపై క్లారిటీ లేదు. తాజాగా రీ లాంచ్ కి సంబంధించి ఓ న్యూస్ వచ్చింది. జూలై 21 లేదా 22న చంద్రయాన్ -2 రీ లాంచ్ చేసేందుకు ఇస్రో ప్రయత్నాలు చేస్తోందని వార్తలు వస్తున్నాయి. 21వ తేదీ ఆదివారం మధ్యాహ్నం లేదా 22వ తేదీ సోమవారం తెల్లవారుజామున ప్రయోగం నిర్వహించాలనే యోచనలో ఇస్రో ఉన్నట్టు సమాచారం.


భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పదేళ్లుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని కఠోర శ్రమ చేసి రూపొందించిన చంద్రయాన్‌-2 ప్రయోగం సాంకేతిక కారణాలతో వాయిదా పడిన సంగతి తెలిసిందే. సోమవారం(జూలై 15,2019) తెల్లవారుజామున 2.51 నిమిషాలకు తలపెట్టిన జీఎస్‌ఎల్‌వీ-3 ఎం-1 రాకెట్‌లో మూడో దశలో సాంకేతిక లోపం కారణంగా చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని అర్ధాంతరంగా నిలిపివేశారు. ఆదివారం(జూలై 14,2019) ఉదయం 6.51 నిమిషాలకు ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ శివన్‌ ఆధ్వర్యంలో కౌంట్‌డౌన్‌ ప్రారంభించారు.


ప్రయోగానికి సరిగ్గా 56 నిమిషాల 24 సెకన్ల ముందు కౌంట్‌డౌన్‌ నిలిపివేశారు. అంటే 1.55 గంటలకు కౌంట్‌ డౌన్‌ ప్రక్రియ ఆగిపోయింది. రాకెట్‌లో అత్యంత కీలకమైన మూడో దశలో క్రయోజనిక్‌ ఇంజిన్‌కు సంబంధించిన బ్యాటరీలు చార్జ్‌ కాకపోవడంతో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పాటు క్రయోజనిక్‌లో ఉండే గ్యాస్‌ బాటిల్‌ లీకేజీ రావడం కూడా సాంకేతిక లోపానికి మరో కారణం. నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని రెండో ప్రయోగ వేదిక నుంచి చంద్రయాన్-2 ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేయడం, సాంకేతిక కారణాలతో ప్రయోగం నిలిచిపోవడం జరిగాయి.


చంద్రుడి గురించి తెలుసుకోవడానికి 60 ఏళ్ల నుంచి పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. యూఎన్ఓ లెక్కల ప్రకారం ప్రపంచంలో అంతరిక్ష ప్రయోగాలు చేసే దేశాలు ఇప్పటివరకు 125 ప్రయోగాలు చంద్రుడి పైనే చేశాయి. భారత్‌ విషయానికొస్తే 2008లో చంద్రుడి మీదకు ఆర్బిటర్‌ను ప్రయోగించి విజయం సాధించడమే కాకుండా చంద్రుడిపై నీటి జాడలున్నాయని కనుగొంది. ప్రపంచంలోని దేశాలన్నీ చంద్రుడిపై పరిశోధనలకు ప్రయోగాలు చేసినపప్పటికీ ప్రధానంగా అమెరికా, రష్యాలే ఈ రంగంలో ఇప్పటికీ పోటీపడుతున్నాయి. తాజాగా.. భారత్‌ రెండోసారి ఆర్బిటర్‌ ద్వారా ల్యాండర్‌ను చంద్రుని ఉపరితలంపై దింపి అందులో అమర్చిన రోవర్‌తో చంద్రుడిపై పరిశోధనలు చేసేందుకు సిద్ధమైంది.


Telangana E-Paper