డైరెక్టర్ మారుతికి కేటీఆర్ అభయం

  Written by : Suryaa Desk Updated: Wed, Jul 17, 2019, 08:45 PM
 

హైదరాబాద్ నగరానికి నీటి కష్టాలు రానున్నాయని వార్తలు వచ్చాయి. హైదరాబాద్ మరో చెన్నై కానుందని.. 48 రోజుల తర్వాత భాగ్యనగరానికి తాగు నీరు కష్టమేనని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ విషయంపై టాలీవుడ్ డైరెక్టర్ మారుతి.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌‌ను ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. కేటీఆర్ గారు.. ఇది నిజమేనా అని మారుతి అడిగారు. తన ట్వీట్‌కు జాతీయ పత్రికలో వచ్చిన కథనాన్ని జత చేశారు. దీనికి కేటీఆర్ స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో హైదరాబాద్ నీటి అవసరాలు కూడా తీరుతాయన్నారు. హైదరాబాద్ నీటి కష్టాలపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నగరంలో తాగు నీటి సమస్య ఉత్పన్నం కాదని నగరవాసులకు భరోసా ఇచ్చారు. ఆ వెంటనే డైరెక్టర్ మారుతి స్పందించారు. శుభవార్త చెప్పారు అంటూ కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
హైదరాబాద్ నగరంలో తాగునీటి సంక్షోభం తలెత్తనుందా అని డైరెక్టర్ మారుతి అడిగిన ప్రశ్నకు.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమాధానం ఇచ్చారు. అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు. నగరంలో తాగునీటి సమస్య రాదన్నారు. నగరానికి అవసరమై న తాగు నీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా అందుబాటులో ఉందని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘హైదరాబాద్ లో నీటి కొరత ఏర్పడుతుందనే రిపోర్ట్ ఖ‌చ్చితమైనది కాదు. నగరానికి అలాంటి పరిస్థితి రాదు. మరి కొన్ని రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీరు ఎల్లంపల్లి ప్రాజెక్టుకి చేరుకోనుంది. దీంతో హైదరాబాద్‌ కి 172 ఎంజీడీల నీరు అందుతుంది. అదే సమయంలో ప్రజలు నీటి ప్రాధాన్యతను గుర్తించి.. పొదుపుగా వాడుకోవాలి'' అని కేటీఆర్ ట్వీట్‌ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా వర్షాలు కురవడం లేదు. దీంతో నదులు, రిజర్వాయర్లు, చెరువుల్లో నీటి మట్టం పడిపోయింది. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ నగరానికి తాగు నీటి కొరత ఏర్పడబోతుందని ఓ జాతీయ మీడియా ప్రచురించిన కథనం నగరవాసుల్లో ఆందోళన రేపింది. హైదరాబాద్ కి 48 రోజులకు సరిపడ తాగు నీరు మాత్రమే ఉందన్న వార్తలు నిద్ర లేకుండా చేశాయి.