తెలంగాణలో రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో విచారణ జరిగింది. మోటారు వాహనాల చట్టం సెక్షన్-67 ప్రకారం ఆర్టీసీ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుందని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. ఆర్టీసీ, ప్రైవేటు రవాణా వ్యవస్థలను సమాంతరంగా నిర్వహించే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పుడు ప్రైవేటీకరణపై మంత్రివర్గ నిర్ణయం తప్పెలా అవుతుందని హైకోర్టు ప్రశ్నించింది. 5100 రూట్లను ప్రైవేటీకరించడం చట్ట విరుద్దమని, సెక్షన్ 102 ప్రకారం ఏ మార్పు చేసినా ఆర్టీసీకి సమాచారం ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆర్టీసీకి ఎలాంటి నష్టం జరగదని సీఎం కేసీఆర్ చెప్పారని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. దీనిపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం.. సీఎం ఏం చెప్పారన్నది న్యాయస్థానానికి సంబంధం లేదని అభిప్రాయపడింది. కేబినెట్ నిర్ణయం చట్టబద్ధమా? చట్ట విరుద్ధమా?అనేది న్యాయస్థానం ముందున్న అంశమని హైకోర్టు వ్యాఖ్యానించింది. సెక్షన్ 102 ప్రకారం.. ప్రభుత్వం అనుసరించాల్సిన ప్రక్రియ ఏంటో వివరించాలని పిటిషనర్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. అనంతరం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.