ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రతిపాదనను మొదటి నుంచి బలంగా వ్యతిరేకిస్తూ వచ్చిన లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ... తాజాగా సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. విలీనం విషయంలో ఆర్టీసీ కార్మికులు వెనక్కి తగ్గడంతో... వారి మిగతా డిమాండ్ల అంశాన్ని సానుకూల దృక్పథంతో పరిశీలించాలని ఆయన తన లేఖలో కోరారు. ఆర్టీసీని ప్రైవేటు రంగంతో పోటీ పడేలా చేయాలనే కేసీఆర్ నిర్ణయాన్ని జేపీ సమర్థించారు. ఆర్టీసీ విలీనం విషయంలో కార్మికులు వెనక్కి తగ్గడం కేసీఆర్ వాదనలకు లభించిన విజయమని ఆయన అన్నారు. ఇందుకు కార్మికులను కూడా అభినందించాలని వ్యాఖ్యానించారు. అయితే వారి మిగతా సమస్యల పరిష్కారం విషయంలో ఉదారంగా వ్యవహరించాలని జేపీ కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు.
అంతకుముందు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసిన జేపీపై సీఎం కేసీఆర్ బహిరంగంగానే విరుచుకుపడ్డారు. అయితే ఆర్టీసీ సమ్మె విషయంతో మాత్రం జేపీ మొదటి నుంచి ప్రభుత్వం చెబుతున్నట్టుగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సరికాదనే వాదనను వినిపించారు. కార్మికులు ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకోవద్దని ఆయన సూచించారు.