ఉపాధ్యాయుల పదోన్నతులపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు. పాత జిల్లాల ప్రాతిపదికగా ఉపాధ్యాయ పదోన్నతులు కల్పించే ఆలోచన ఉన్నదని ఆమె వివరించారు. విద్యాశాఖ అధికారులతో చర్చించి త్వరలోనే నిర్ణయం ప్రకటించనున్నట్టు తెలిపారు. అప్‌గ్రేడెడ్ పండితులు, పీఈటీలతో సహా ఖాళీగా ఉన్న ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు పద్నోతుల షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి నేతృత్వంలో ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్‌పీసీ), ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) ప్రతినిధులు విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డితో సోమవారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ముఖ్యమైన, ఆర్థిక భారం లేని సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించిన మంత్రి ప్రాధ్యన్యతలను బట్టి సమస్యలను పరిష్కరించుకుందామని హామీ ఇచ్చారు.
గతంలో అంతర్జిల్లా బదిలీలు నిర్వహించాలని, ఎంఈవో పోస్టులను టెన్యూర్ పోస్టులుగా మార్చి సీనియర్ ప్రధానోపాధ్యాయులను డిప్యూటేషన్‌పై నియమించాలని యూఎస్‌పీసీ, జాక్టో ప్రతినిధులు కోరారు. 21 డీఈవో, 63 డిప్యూటీఈవో, 50 ఎంఈవో పోస్టులను అదనంగా మంజూరు చేయాలని తెలిపారు. ఎస్సీ,ఎస్టీ మొదటితరం ఉపాధ్యాయులకు పీజీ కోర్సు చేసేందుకు ఆన్‌డ్యూటీ సౌకర్యం కల్పించాలని సూచించారు. మోడల్ స్కూల్ టీచర్లకు సర్వీస్ రూల్స్ విడుదల చేయాలని కోరారు. పార్ట్‌టైం స్వీపర్లకు సర్వీస్ సర్టిఫికెట్లు జారీ చేసిన ప్రధానోపాధ్యాయుల సస్పెన్షన్ ఆదేశాలను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. కొత్త జిల్లాల్లో ఎస్‌ఎస్‌సీ స్పాట్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని వినతిపత్రం సమర్పించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డితోపాటు యూఎస్‌పీసీ, జాక్టో ప్రతినిధులు సిహెచ్ రాములు, చావ రవి, పర్వతరెడ్డి, సదానందంగౌడ్, శ్రీనునాయక్, గీతాంజలి తదితరులు పాల్గొన్నారు.