ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ ఇద్దరిలో సీఎస్‌ ఎవరు అయ్యే అవకాశముంది?

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 11, 2019, 07:23 PM

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి పదవీ కాలం ఈ నెలాఖ‌రుతో ముగుస్తోంది. దీంతో తర్వాతి సీఎస్ ఎవరన్న సస్పెన్స్‌ కంటిన్యూ అవుతోంది. దాదాపు 14 మంది సీనియర్ ఐఏఎస్‌ల పేర్లను సీఎం కేసీఆర్‌ పరిశీలిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. అయితే ఈ 14 మందిలో ఇద్దరి పేర్లు మాత్రమే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎవరా ఇద్దరు? ఆ ఇద్దరిలో సీఎస్‌ ఎవరు అయ్యే అవకాశముంది?  కొత్త సీఎస్‌ వేటలో సీఎం కేసీఆర్ - ముఖ్యమంత్రి పరిశీలనలో 14 మంది ఐఏఎస్‌ల పేర్లు - తమతమ ప్రయత్నాల్లో సీనియర్ అధికారులు - మరి ఎవరిని వరించబోతోంది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి? ప్రభుత్వ పరిపాలన పూర్తిగా సీఎస్‌ నాయకత్వంలో సాగుతుంది. పరిపాలనా కేంద్రమైన సెక్రటెరియట్ కేంద్రంగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యనిర్వహణ చేస్తారు. తెలంగాణ లాంటి కొత్త రాష్ట్రంలో, రాష్ట్ర నిర్మాణంలో పాలుపంచుకోవాలని ప్రతి ఐఏఎస్ అధికారి అనుకుంటారు. 2014 రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలి సీఎస్‌ గా రాజీవ్ శర్మను నియామించారు సీఎం కేసీఆర్. ఆ తర్వాత ప్రదీప్ చంద్రా, ఎస్పీ సింగ్, ఎస్ కే జోషిని సీఎస్‌ పదవి వరించింది. ఆ తర్వాత రాజీవ్ శర్మను ప్రభుత్వం ముఖ్యసలహాదారుగా నియమించుకున్నారు కేసీఆర్.  సీఎం కేసీఆర్ అధికారులకు ఇచ్చే గౌరవంతోపాటు, నిత్యం ఐఏఎస్ అధికారులతో సమీక్షలు నిర్వహించడాన్ని, గౌవరంగా భావిస్తారు ఐఏఎస్‌లు. సీఎం లాంటి వారు నిత్యం తమతో సమీక్షలు చెయ్యడంతో తెలంగాణ ఐఏఎస్ అధికారులు సంతోషంగా ఫీల్ అవుతుంటారు. దీంతో సహజంగానే తాము సీఎంకు మరింత దగ్గర కావాలని కోరుంటారు. అంతేకాక ప్రతి సీనియర్ ఐఏఎస్ అధికారీ తన సర్వీస్‌లో ఒక్కసారైనా సీఎస్‌ గా ఉండాలని తపిస్తారు. దీంతో సీఎస్‌ పదవి కోసం ఆధికారులు అన్ని ప్రయాత్నాలూ చేస్తారు. ప్రస్తుత సీఎస్‌ ఎస్.కె జోషి, 2018 జనవరి 31న తెలంగాణ సీఎస్‌ గా పదవీ బాధ్యతలు తీసుకున్నారు. జోషి పదవీ కాలం ఈనెల 31తో పూర్తి కానుంది. దీంతో కొత్త సీఎస్‌ గా ఎవరు పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్నారనేది ఐఏఎస్‌లతో పాటు సెక్రటేరియట్ వర్గాల్లో ఉత్కంఠ కలిగిస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దాదాపు 14మంది పేర్లను పరిశీలిస్తోంది. అందులో ముగ్గురు సీనియర్ ఆఫీసర్లుగా పని చేసిన అనుభవంతో పాటు రాష్ట్రంలో కొత్త పథకాలు తీసుకురావడంలో వాళ్ళ పాత్ర ఉండడంతో, వారి పేర్లను వడబోస్తోంది కేసీఆర్ ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్న 14 మంది ఐఏఎస్‌ల పేర్లలో, అజయ్ మిశ్రా, బినాయ్ కుమార్, బీపీ ఆచార్య, పుష్ప సుబ్రమణ్యం, సురేష్ చందా, చిత్రా రామచంద్రన్, హీరాలాల్ సమరియా ఉన్నారు. వీరితో పాటు రాజేశ్వరి తివారి, సోమేశ్ కుమార్, సునీల్ శర్మలు సైతం ఉన్నారు. ప్రభుత్వ పరిశీలనలో వున్న అజయ్ మిశ్రా 1984 బ్యాచ్‌కు చెందిన అధికారి. ఈయన 2020 జులై వరకూ పదవీ విరమణ వుంది. 1989 బ్యాచ్‌కు చెందిన సోమేశ్ కుమార్‌కు 2023 డిసెంబర్ వరకు సర్వీస్ ఉంది. వీరిలో ఒకరిని సీఎస్‌ గా నియమించే అవకాశం ఉందని ప్రగతి భవన్ వర్గాలు అంటున్నాయి. వీరితోపాటు చిత్రా రామచంద్రన్ , సిన్హా పేర్లను సైతం పరిశీలిస్తున్నారట సీఎం కేసీఆర్. అయితే కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన ప్రభుత్వ ప్రధాన సలహదారులు రాజీవ్ శర్మకు సన్నిహితుడుగా ఉన్న అజయ్ మిశ్రా, సోమేష్‌ కుమార్లలో, ముందుగా అజయ్ మిశ్రాను సీఎస్‌గా నియమించాలని కేసీఆర్ భావిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. తర్వాత సోమేష్ కూమార్‌కు ఛాన్స్ ఇవ్వొచ్చన్న మాటలు వినపడుతున్నాయి. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com