కేసీఆర్ ప్రభుత్వం సంచలన నిర్ణయం

  Written by : Suryaa Desk Updated: Fri, Feb 14, 2020, 07:22 PM
 

హైదరాబాద్‌లో వాతావరణ కాలుష్యం రోజు రోజుకూ పెరిగిపోతోంది. సిటీలో వాహనాలు, సిటీ బయట ఫ్యాక్టరీల నుంచి వెలువడే పొగతో భాగ్యనగరం కాలుష్య కోరల్లో చిక్కుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో పెరిగిపోతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. వాతావరణాన్ని తీవ్రస్థాయిలో కలుషితం చేస్తున్న డీజిల్‌ వాహనాలపై ఆంక్షలు విధించాలని. అదే సమయంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని యోచిస్తున్నట్లు సమాచారం. కలెక్టర్ల సదస్సులో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది.
ప్రస్తుతం ఢిల్లీ తీవ్ర వాయు కాలుష్యంతో కొట్టుమిట్టాడుతోంది. ఆ పరిస్థితి హైదరాబాద్‌కు రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు ఆదేశించారు. మొక్కలు పెంచడంతోపాటు డీజిల్‌ వాహనాలను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో గతంలో రవాణాశాఖ చేసిన ప్రతిపాదనల పునఃసమీక్ష, నిపుణులు ఇచ్చిన నివేదికలోని వివరాల ఆధారంగా కొత్త ప్రతిపాదనలు రూపొందించడంపై అధికారులు దృష్టి సారించాలని అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించి తెలంగాణ మోటారు వాహన చట్టానికి సవరణలు చేయాలని తెలంగాణ రవాణాశాఖ భావిస్తోంది. కొత్త జరిమానాలను ప్రతిపాదిస్తూ చట్ట సవరణ చేయనున్నట్టు తెలిసింది.
హైదరాబాద్‌‌లో ప్రస్తుతం 15 లక్షల డీజిల్‌ వాహనాలు తిరుగుతున్నాయి. వీటి నుంచి పెద్ద మొత్తంలో కర్బన ఉద్గారాలు విడుదలవుతూ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో డీజిల్‌ వాహనాల సంఖ్య పెరగకుండా చూడాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే పెట్రోల్‌ వాహనాల కంటే డీజిల్‌ వాహనాలపై 2 శాతం జీవిత పన్ను అదనంగా వసూలు చేస్తున్నారు. చాలా మంది దీన్ని పెద్ద భారంగా భావించడం లేదు. ఈ నేపథ్యంలో డీజిల్ వాహనాలపై లైఫ్ టాక్స్‌ను మరింత పెంచే అంశాన్ని పరిశీలిస్తోంది. అంతేకాదు 12 ఏళ్లకు పైబడిన డీజిల్‌ వాహనాలను నిషేధించాలని కూడా యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక బ్యాటరీ వాహనాలకు పన్నులు, ఇతరత్రా అంశాల్లో మినహాయింపులు ఇవ్వడం వంటి అంశాలను కూడా పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలను ఇవ్వబోతోంది రవాణాశాఖ.