ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దళితుల భూపంపిణీకి సర్కార్ మంగళం?

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 18, 2020, 07:58 PM

తెలంగాణ రాష్ట్రంలో దళితులకు మూడేకరాల భూ పంపిణీ పథకాన్ని సర్కార్ మంగళం పాడనున్నది. భూమిలేని దళితులకు మూడేకరాల భూమిని పంపిణీ చేస్తామని, ఆ భూమి కూడా సాగుకు యోగ్యంగా ఉన్నవాటినే ఇస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు పలుమార్లు వెల్లడించిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత జరిగిన తొలి సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మెనిఫేస్టోలో కూడా పొందుపర్చింది. సర్కార్ భూమి అందుబాటులో లేకపోతే బహిరంగ మార్కెట్ లో కొనుగోలు చేసి భూపంపిణీ చేస్తామని గొప్పలు చెప్పింది. కానీ గడిచిన ఆరేళ్లల్లో భూపంపిణీ కార్యక్రమానికి కేసీఆర్ సర్కార్ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని గణాంకాలను బట్టి తెలుస్తున్నది.
తొలిసారి ఏర్పాటైన టీఆర్ఎస్ ప్రభుత్వంలో భూ పంపిణీపై కొంత హడావుడి చేసినప్పటికీ రెండోసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన దళితుల భూ పంపిణీపై మాట కూడా మాట్లాడడం లేదు. దీంతో దళితులకు భూపంపిణీ కార్యక్రమానికి కేసీఆర్ ప్రభుత్వం ఎత్తివేయనున్నదా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.


రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ ప్రభుత్వం దళితులకు 12,845.69 ఎకరాల్లో భూమిని 4986 మందికి పంపిణీ చేశామని అధికారులు ఇచ్చిన లెక్కల ప్రకారం తెలిసింది. ఈ పంపిణీ కార్యక్రమం ఐదేళ్ల పాటు పూర్తిస్థాయిలో కొనసాగించలేదని సమాచారం.


దళితులకు భూ పంపిణీ కార్యక్రమం కోసం 551.34కోట్ల నిధులను భూ కొనుగోలు కోసం ప్రభుత్వం వెచ్చించింది. రాష్ట్ర వ్యాప్తంగా భూమి లేని దళిత నిరుపేదలకు 3 ఎకరాలు ఇచ్చేందుకు ఈ నిధులను కేటాయించింది. ప్రభుత్వ భూమి లేని చోట బహిరంగ మార్కెట్ లో కొనుగోలు చేసి ఇవ్వాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమలు అమలు బాధ్యతలను తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)కు అప్పగించింది.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా 9.7లక్షల దళిత కుటుంబాల్లో 3.3లక్షల కుటుంబాలకు సెంటు భూమి కూడా లేదని తేలింది. దళితుల జనాభాలో భూమి లేని నిరుపేదలు 34శాతం ఉన్నారని సెర్ప్ ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. దీని ఆధాారంగానే భూ పంపిణీ కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం 2014 సంవత్సరంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో దళితులకు భూ పంపిణీ కార్యక్రమాన్నిస్వీకారం చుట్టింది. అదే రోజు నల్గొండ జిల్లా నకిరేకల్ మండలంలో 337 మంది దళితులకు భూ పంపిణీ చేసింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 959 మంది దళితులకు 2524 ఎకరాల భూమిని పంపిణీ చేసింది. దీని కోసం రూ.94కోట్ల నిధులను ఖర్చు చేసిందని అధికారులు ఇచ్చిన లెక్కల ప్రకారం తెలుస్తున్నది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో 1911 మందికి 4999 ఎకరాల భూమి పంపిణీ చేయగా, 2016-17లో 1359 మందికి 3280 ఎకరాలు, 2017-18లో 757 మందికి 2042.69 ఎకరాల భూమిని పంపిణీ చేసినట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. ఇక అప్పటి నుంచి భూ పంపిణీపై సీఎం కేసీఆర్ ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు.
రాష్ట్రవ్యాప్తంగా 2018లో భూ సమగ్ర సర్వేను భారీ ఎత్తున చేపట్టారు. ఈ సర్వే ఫలితంగా లాభం కంటే కూడా నష్టం ఎక్కువగా జరిగిందని తెలుస్తుంది. భూ సర్వేలో తేలిన మిగులు భూములను నిరుపేదలకు పంపిణీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. కానీ భూ సర్వే ఫలితంగా వచ్చిన తగదాలు ఇప్పటి వరకూ తేలలేదని తెలుస్తున్నది. మిగులు భూములను రెవెన్యూ అధికారులు విచ్చలవిడిగా వేరే వ్యక్తులకు బదలాయించినట్లు తెలిసింది. వీటిలో ఎక్కువ భాగం అసైన్డ్ భూములున్నట్లు సమాచారం. అసైన్డ్ భూముల్లో కబ్జాలో ఉన్న వారికి డబ్బులు తీసుకొని పాస్ పుస్తకాలు జారీ చేసినట్లు పలుచోట్లు ఫిర్యాదులు వచ్చాయి. కాస్తు కబ్జాలో ఉన్నవారిని కాదని రాజకీయ ప్రోద్భలం ఉన్న వారికి పాస్ పుస్తకాలను జారీ చేశారు. అంతేకాకుండా వలస వెళ్లిన పేదల భూములనే టార్గెట్ చేసి ఇతర వ్యక్తులను బదలాయించి పాస్ పుస్తకాలను జారీ చేసినట్లు తెలిసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫిర్యాదులు వేలల్లో రావడంతో మిగులు భూముల లెక్కలు తేలడం లేదు. దీనిపై ప్రభుత్వం కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా తర్జన భర్జన పడుతున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భూ పంపిణీ కార్యక్రమం కొంత మేరకు జరిగింది. భూ సంస్కరణల చట్టం ప్రకారం భూధాన్ భూములు, పోరంబోకుటు, అసైన్డ్ భూములను భూమి లేని నిరుపేదలకు పంపిణీ చేసింది. భూ సంస్కరణ చట్టం 1950వ సంవత్సరంలో వచ్చినప్పటికీ స్వర్గీయ మాజీ సీఎం ఎన్టీయార్ హయంలో భూ పంపిణీ వేగంగా జరిగిందని చెప్పవచ్చు. భూ సంస్కరణ చట్టం వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 31,032 మందికి 41,065.67 ఎకరాలను ప్రభుత్వం పంపిణీ చేసింది. దీన్ని 31 ఏళ్లల్లో పంపిణీ చేసిందని తెలిసింది. 1982-83లో భూ పంపిణీ కోసం అప్పటి ప్రభుత్వం రూ. 92.1కోట్లు ఖర్చు చేసిందని అధికారులు ఇచ్చిన లెక్కల ప్రకారం తెలుస్తున్నది. ఇంత భారీ ఎత్తున భూ పంపిణీ చేసిన ప్రభుత్వాలు దళితులకు ఇచ్చిన భూముల్లో గడ్డి పోచ కూడా మొలవడం లేదని తెలుస్తుంది. దీంతో ఆ భూములన్ని నిరుపయోగంగా పడినట్లు సమాచారం. దీంతో దళితుల జీవన విధానంలో ఎలాంటి మార్పులు రాలేదనేది సత్యం.
కేసీఆర్ సర్కార్ సాగుకు యోగ్యమైన భూమిని ఇస్తామని చెప్పినప్పటికీ వాటిని కూడా పూర్తి స్థాయిలో చేయకపోవడంతో దళితులకు భూ పంపిణీ కలగానే మిగిలిపోయిందని చెప్పకతప్పదు.
భూపంపిణీ వివరాలు
క్రమసంఖ్య సంవత్సరం ఎకరాలు లబ్ధిదారులు
1. 2014-15 2524 959
2. 2015-16 4999 1911
3. 2016-17 3280 1359
4. 2017-18 2042.69 757
5. 2018-19 ----- -----
మొత్తం 12,845.69 4986










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com