ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేసీఆర్ కి కీలక నేత షాక్..?

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 18, 2020, 01:28 PM

టీఆర్ఎస్ పార్టీలో ముసలం నెలకొందా..? పార్టీకి చెందిన కీలక నేతలు గుర్రుగా ఉన్నారా..? పార్టీలో ఉంటూ ఇతర పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంలో ఆంతర్యం ఏంటి..? పార్టీ అధినేత కేసీఆర్ ను నిత్యం విమర్శించే వ్యక్తిని పొగడటంలో మర్మం ఏంటి..? ఇవే ప్రశ్నలు తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ ఒక్కరిని తొలచివేస్తున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే టీఆర్ఎస్ పార్టీలో శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. కొన్ని రోజులుగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
అంతేకాదు ప్రతిపక్ష నేతలపై ప్రశంసలు కురిపించడంతో రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయారు. స్వామిగౌడ్ టీఆర్ఎస్ పార్టీకి దూరం అవుతున్నారంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ ఘటన నుంచి టీఆర్ఎస్ పార్టీ బయట పడకముందే మరోసారి షాక్ ఇచ్చారు. ఇటీవలే కాంగ్రెస్ ఎంపీని పొగిడిన ఆయన తాజాగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో పాల్గొని హల్ చల్ చేయడం రాజకీయపరంగా ఆసక్తికరంగా మారింది. గురువారం హైదరాబాద్ బండ్లగూడ జాగీర్‌ నగరపాలకసంస్థ కిస్మత్‌పూర్‌లో కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవంలో స్వామి గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. టీఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొనకుండా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో పాల్గొనడంతో రాజకీయంగా అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఐతే ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పార్టీలకతీతంగా నిర్వహించామని నిర్వాహకులు కాంగ్రెస్ శ్రేణులు తెలిపారు. ఇకపోతే ఇటీవలే కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తారు స్వామిగౌడ్. కేసీఆర్, కేటీఆర్ మీద నిత్యం విమర్శలు గుప్పించే రేవంత్ రెడ్డి‌ని పొగడటంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్ బోయిన్‌పల్లిలో సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రేవంత్ రెడ్డితోపాటు స్వామిగౌడ్ కూడా హాజరయ్యారు.
రేవంత్ రెడ్డి అగ్రకులంలో పుట్టినా కూడా వెనుకబడిన కులాల వారికి అండగా నిలుస్తున్నారని ప్రశంసించారు. బడుగు, బలహీనవర్గాలకు అండగా ఉంటున్న రేవంత్ రెడ్డికి మనం కూడా అండగా ఉండాలని బీసీ సామాజికవర్గానికి పిలుపునిచ్చారు. వైట్ డ్రెస్సులు వేసుకునే వారికి అమ్ముడు పోవద్దని సూచించారు. ఎన్నికల్లో డబ్బులున్న వారికే పార్టీలు టికెట్లు ఇస్తున్నాయంటూ స్వామిగౌడ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అంతకుముందు కుల రాజకీయాలపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్‌లోని హైదర్‌గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన నారాయణ గురు జయంతి వేడుకల్లో స్వామి గౌడ్ పాల్గొన్న స్వామిగౌడ్ కొన్ని కులాలకు చెందిన అతి కొద్ది మందే పరిపాలనా, ప్రజస్వామ్యాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు. ఏకరూప సిద్ధాంతం భారత్ దేశంలో అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్వామిగౌడ్ అభిప్రాయపడ్డారు. దేశంలో కుల రక్కసి తన వికృత రూపాన్ని ప్రదర్శిస్తూ బడుగుబలహీన వర్గాలకు అన్యాయం చేస్తుందని స్వామిగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో పాల్గొనడంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. స్వామిగౌడ్ టీఆర్ఎస్ లో ఉంటారా..? వీడుతారా అన్న దానిపై జోరుగా చర్చ జరుగుతుంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com