రికార్డు స్థాయిలో మూసిలోకి నీరు

  Written by : Suryaa Desk Updated: Sun, Oct 18, 2020, 03:05 PM
 

హిమాయత్‌సాగర్ 10 గేట్లు ఎత్తివేయడంతో ఉధృతంగా మూసీ ప్రవహిస్తోంది. మూసీ ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తింది. రికార్డు స్థాయిలో మూసిలోకి నీరు చేరుతోంది. హైదరాబాద్‌తో పాటు మూసీనది ఎగువ పరివాహక ప్రాంతాల్లో ఇటీవల విస్తారంగా కురిసిన వర్షాలకు ఇప్పటికే ఈ ప్రాజెక్టు నిండి పోయింది. మరోవైపు మూసీ పరివాహక ప్రాంతాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. భారీ వర్షాలతో పాతబస్తీ అతలాకుతలమైంది. పాతబస్తీలోని లోతట్టు ప్రాంతాలు జలమయమ్యాయి. వరద నీటిలో మలక్‌పేట ప్రధాన రహదారి మునిగిపోయింది. మలక్‌పేట్ రైల్వే బ్రిడ్జి కింద భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. ముసారంబాగ్‌, చాదర్‌ఘాట్ లోలెవల్ బ్రిడ్జిలు నీటమునిగాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. టోలిచౌకి, ఫలక్‌నుమా, అంబర్‌పేట్‌లోని పలు కాలనీలు జలదిగ్బంధంలో ఉన్నాయి. హైదరాబాద్-విజయవాడ రహదారిపై వరద నీరు చేరింది. విజయవాడకు వెళ్లే వాహనాలను హబ్సిగూడ మీదుగా దారి మళ్లించారు.