ఆ పార్టీలను ఓటర్లు ఓ కంట కనిపెడుతూనే ఉన్నారు: రేవంత్ రెడ్డి

  Written by : Suryaa Desk Updated: Thu, Nov 26, 2020, 03:28 PM
 

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కొందరు నాయకులు ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే..! ఎంఐఎం, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అక్రమ కట్టడాలను కూల్చివేస్తామని  టీఆర్ఎస్ ప్రభుత్వం అంటోందని, అలాగైతే హుస్సేన్ సాగర్ వద్ద ఉన్న ఎన్టీఆర్, పీవీల సమాధులను కూడా కూలగొట్టాలని ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుదీన్ ఒవైసీ అనడం వివాదాస్పదమైంది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు. పీవీ నరసింహారావు, ఎన్టీ రామారావు తెలుగు వారి గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని విశ్వవేదికపై చాటిన మహానేతలు అని అన్నారు. అలాంటి గొప్ప వ్యక్తుల పేర్లను తుచ్ఛ రాజకీయ ప్రయోజనాల కోసం వివాదాస్పదం చేయడం బీజేపీ, ఎంఐఎంలకే చెల్లిందని విమర్శించారు. ఇలాంటి పార్టీలు మనకు అవసరమా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఏది ఏమైనా అనవసరమైన వివాదాలను తీసుకుని వస్తున్న పార్టీలను ఓటర్లు ఓ కంట కనిపెడుతూనే ఉన్నారు.