మాజీ మంత్రి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు

  Written by : Suryaa Desk Updated: Tue, May 04, 2021, 05:41 PM
 

ప్రగతి భవన్‌ లో సీఎం కేసీఆర్ ను కలిసే అవకాశం కూడా మంత్రులకు ఉండదని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. సీఎం కేసీఆర్ కు ఆరోగ్యం బాగాలేదని తెలిసి కలవడానికి వెళ్లిన మంత్రులను అనుమతించలేదని ఆయన ఆరోపించారు. ఇంత అహంకారమా? అని ఆరోజు మంత్రి గంగుల కమలాకర్‌ తనతో అన్నారని ఈటల రాజేందర్ చెప్పారు. మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌ తనపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో హుజూరాబాద్‌ లోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈటల రాజేందర్ మాట్లాడారు. 2014 వరకే కేసీఆర్‌.. ధర్మాన్ని, ప్రజలను నమ్ముకున్నారని ఈటల అన్నారు. తెలంగాణ గాంధీగా పేరుగాంచిన గొప్ప వ్యక్తి నేడు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఎవరివో తప్పుడు సలహాలు, నివేదిక వల్ల తనపై కక్ష సాధిస్తున్నారని, తన వ్యవహారం నచ్చకపోతే పిలిపించి అడిగితే తానే రాజీనామా చేసేవాడినని అన్నారు. ఇప్పుడు తనను విమర్శిస్తున్నవారంతా తన సహచరులే అని, తాను ముఖ్యమంత్రిని కావాలనుకోలేదని స్పష్టం చేశారు. కేసీఆర్‌ తర్వాత ఆయన కుమారుడే సీఎం కావాలని అన్నానని అన్నారు. సీఎం కేసీఆర్ చట్టాన్ని, ధర్మాన్ని, చివరికి ఉద్యమాన్ని అమ్ముకున్నారని విమర్శించారు. పార్టీకి వ్యతిరేకంగా తాను ఎప్పుడూ పనిచేయలేదని అన్నారు. ఐఏఎస్ అధికారులు దారుణంగా విచారించారని, దేశ చరిత్రలోనే ఇంత కుట్ర పూరితంగా ఎవరూ వ్యవహరించలేదని అన్నారు.