ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాస్కులు వాడేట‌ప్పుడు ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, May 08, 2021, 12:06 PM

ఇతరుల నుండి మనకు క‌రోనా వైరస్ సోక‌కుండా ఉండాలంటే మాస్క్ ధరించడం త‌ప్ప‌నిస‌రి. బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడే కాకుండా ఇంట్లో ఉన్న‌ప్పుడు కూడా మాస్కులు ధ‌రించాల‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రెండు మాస్కులు వాడితే ఇంకా మంచిద‌ని కొంతమంది చెబుతున్నారు. ఈ క్ర‌మంలో మాస్క్ వాడిన‌ప్పుడు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలో తెలుసుకుందాం.


ఎలాంటి మాస్కులు ఎంచుకోవాలి?
- స‌ర్జిక‌ల్ మాస్క్ అయినా క్లాత్ మాస్క్ అయినా 3 లేయ‌ర్లు ఉన్న‌వే ఎంచుకోవాలి.
- బ‌ట్ట మాస్కుల‌ను తీసుకోవాలనుకుంటే సుల‌భంగా శ్వాస తీసుకునేందుకు వీలు ఉండే మాస్కుల‌ను తీసుకోవాలి.
- మాస్క్ మీ ముఖాన్ని మొత్తం కవర్ చేసేలా ఉండాలి. అంటే ముక్కు, నోరు, గడ్డం భాగం పూర్తిగా క‌వ‌ర్ అయ్యేలా ఉండాలి.
- ముక్కు ద‌గ్గ‌ర స్ట్రిప్ ఉండే మాస్కుల‌ను వాడటం మంచిది. ఈ స్ట్రిప్ ఉండ‌టం వ‌ల్ల బ‌య‌ట గాలిని మ‌నం పీల్చుకోకుండా జాగ్ర‌త్త ప‌డొచ్చు.
- రెండేళ్ల‌లోపు చిన్నారుల‌కు మాస్క్ అవ‌స‌రం లేదు. రెండేళ్లు దాటిన చిన్న పిల్ల‌ల‌కు బ‌ట్ట మాస్క్‌ ను ఎంచుకుంటే అవి వారి ముఖానికి ఫిట్ అయి బిగుతుగా ఉండేలా చూసుకోవాలి.


పాటించాల్సిన జాగ్రత్తలు:


- మాస్క్ పెట్టుకునే ముందు, తీసిన త‌ర్వాత క‌చ్చితంగా చేతుల‌ను శానిటైజ్ చేసుకోవాలి.
- మాస్క్ పెట్టుకునేటప్పుడు లేదా తీసేటప్పుడు కేవ‌లం మాస్క్‌ కు ఉన్న దారాన్ని మాత్ర‌మే ప‌ట్టుకోవాలి. మాస్క్‌ ను ప‌ట్టుకోకూడ‌దు.
- త‌ర‌చూ మాస్క్‌ను ప‌ట్టుకోవ‌డం కూడా మంచిది కాదు. ఎప్పుడైనా మాస్క్‌ను ప‌ట్టుకోవాల‌న్నా చేతుల‌ను శానిటైజ్ చేసుకోవాలి.
- మ‌నం పెట్టుకునే మాస్క్ క‌చ్చితంగా ముక్కు, నోరు, గ‌డ్డం భాగాన్ని క‌వ‌ర్ చేయాలి. మఖానికి స‌రిపోయేలా ఫిట్‌ గా ఉండాలి.
- ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు వెళ్లేట‌ప్పుడు మాస్క్ పెట్టుకుంటే.. తిరిగి ఇంటికి వ‌చ్చే వ‌ర‌కు మాస్క్‌ ను తీయొద్దు.
- వాడిన మాస్క్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఒక‌సారి మాస్క్‌ను ఉప‌యోగించిన త‌ర్వాత డెటాల్ వేసిన వేడి నీటిలో నాన‌బెట్టాలి. ఆ త‌ర్వాత మాస్క్‌ను ఉతికి ఎండ‌లో ఆరేయాలి. ఉతికాం క‌దా అని ఒక‌రి మాస్క్ మ‌రొక‌రు వాడ‌కూడ‌దు.
- బ‌ట్ట‌తో త‌యారుచేసిన మాస్కుల విష‌యంలో జాగ్రత్త‌గా ఉండాలి. వేసవి కాలంలో మాస్క్ ధ‌రించిన‌ప్పుడు చెమ‌ట ప‌ట్టేస్తుంది. అయితే బ‌ట్ట మాస్కులు తొంద‌ర‌గానే చెమ‌ట‌ను పీల్చేస్తాయి. కాక‌పోతే అలా చెమ‌ట‌తో నిండిన మాస్కులతో అల‌ర్జీలు వ‌చ్చే అవ‌కాశం ఎక్కువ‌. చెమ‌ట‌తో త‌డిచిన మాస్కుల‌పై క్రిములు, బ్యాక్టీరియా కూడా త్వ‌ర‌గా చేర‌తాయి. కాబ‌ట్టి చెమ‌ట ప‌ట్టిన మాస్కుల‌ను వెంట‌నే తీసేయాలి.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com