హుజురాబాద్ ఉపఎన్నికపై కేసీఆర్ ఫోకస్

  Written by : Suryaa Desk Updated: Sun, Jun 13, 2021, 01:16 PM
 

మాజీమంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ స్థానంలో ఉపఎన్నికకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈటల రాజేందర్ రాజీనామా ఆమోదం పొందడంతో హుజురాబాద్ కు ఉపఎన్నిక జరగనుంది. అధికార టీఆర్ఎస్ ఈ ఉప ఎన్నికను ప్రతిష్టత్మకంగా తీసుకుంది. హుజురాబాద్ ఉపఎన్నికపై సీఎం కేసీఆర్ ఫోకస్ పెట్టారు. ఈ ఉప ఎన్నికలో అనుచరించాల్సిన వ్యూహాలపై ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల నేతలతో సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. నాగార్జున సాగర్ ఉపఎన్నికలో విజయడంకా మోగించిన టీఆర్ఎస్.. హుజూరాబాద్ పై పట్టు కోల్పోకుండా ఉండేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే ఆదివారం వరంగల్, కరీంనగర్ ముఖ్య నేతలతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు.


టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై చర్చించే అవకాశం. అంతేకాదు ఉప ఎన్నిక నేపథ్యంలో నేతలకు ప్రచార బాధ్యతలు అప్పగించనున్నారని తెలుస్తోంది. ఇక, బీజేపీ తరుపున మాజీ మంత్రి ఈటల రాజేందర్ బరిలో దిగనున్నారు. ఇప్పటికే ఈటల రాజేందర్ తన నియోజకవర్గంలో అనుచరులతో మంతనాలు జరిపారు. సీఎం కేసీఆర్ పైనే నేరుగా విమర్శలు ఎక్కుపెట్టారు. హుజురాబాద్ లో జరిగే ఉప ఎన్నిక కురుక్షేత్రం లాంటిదని, కౌరవులు పాండవులు మధ్య జరిగే యుద్ధంగా అభివర్ణించారు. దీంతో ఈటలను టీఆర్ఎస్ ఎలా ఎదర్కొంటుంది అనేది ఉత్కంఠగా మారింది.