మావోయిస్టు పార్టీ కీలక నేత కన్నుమూత

  Written by : Suryaa Desk Updated: Sun, Jun 13, 2021, 03:29 PM
 

మావోయిస్టు పార్టీ కీలక నేత కత్తి మోహన్ రావు అలియాస్ ప్రకాశన్న అలియాస్ దామ దాదా అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కొంత కాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతూ జూన్ 10న ఉదయం 11.20 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ ప్రకటన విడుదల చేసింది. కత్తి మోహన్ రావు మృతి పట్ల మావోయిస్టు పార్టీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కత్తి మోహన్ రావు స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా భయ్యారం మండలంలోని గార్ల గ్రామం. మహబూబాబాద్‌లో ఇంటర్, ఖమ్మంలో డిగ్రీ, కాకతీయ యూనివర్సిటీలో ఎంఎస్సీ పీజీ పూర్తి చేశారు. డబుల్ గోల్డ్ మెడలిస్టు. 1982లో విప్లవ జీవితంలోకి ప్రవేశించారు. 1985లో ఆయన ఖమ్మంలో అరెస్ట్ అయ్యి ఆరేళ్లు జైలు జీవితం అనుభవించారు. అనంతరం బయటకు వచ్చిన ఆయన మళ్లీ విప్లవ జీవితాన్ని ప్రారంభించారు. ఆనాటి నుంచి అజ్ఞాత జీవితం గడుపుతున్నారు. దండకారణ్యంలో విప్లవ పాఠాలు బోధిస్తున్నారు. ఈ క్రమంలో అనారోగ్యంతో ఆయన కన్నుమూశారు.