ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్తగూడెం పీఠం రేసులో.. కేటీఆర్ సన్నిహితుడికి కీలక పదవి.!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 15, 2021, 06:50 PM

2009 నవంబర్ 29న కేసీఆర్ సచ్చుడా, తెలంగాణ వచ్చుడా అన్న నినాదంతో మలిదశ ఉద్యమం మొదలైంది. మలిదశ ఉద్యమం ఊహించని రీతిలో ఉవ్వెత్తున ఎగసింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో సుమారు 1200 మంది ఆత్మ బలిదానం చేసుకున్నారు. మరికొంతమంది యోధులు ప్రాణాలకు సైతం తెగించి తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా నిలుస్తూ పోలీసుల లాఠీ దెబ్బలకు ఓర్చి, అనేక కేసులను సైతం ఎదుర్కొని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ వీరత్వం చాటారు.


తెలంగాణ ఉద్యమానికి తలదించిన కేంద్రం 2014 ఫిబ్రవరిలో ప్రత్యేక తెలంగాణను ప్రకటించింది. కానీ, తెలంగాణ ఉద్యమంలో పాల్గొని, ఎంతో కీలక రోల్స్ పోషించిన యోధులకు మాత్రం రాష్ట్రంలో అనేక చోట్ల సరైన గౌరవం దక్కడం లేదు. వేరే పార్టీలను అడ్డుపెట్టుకొని గెలిచి.. వలసలకు అధిక ప్రాధాన్యం కల్పించి.. అధికార పార్టీ వారికి పెద్దపీట వేసింది.


తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఉద్యమకారులకు పెద్దపీట వేస్తారని అనుకున్నారు. కానీ, దానికి పూర్తి భిన్నంగా తయారైంది నేటి పరిస్థితి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు కావస్తున్నా అడపా.. దడపా తప్ప ఎక్కడా ఉద్యమకారులకు పదవులు ఇచ్చి గౌరవించిన దాఖలాలు లేవని పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు పెదవి విరుస్తున్నారు.


ఎన్నికల వేళ అధిష్టానం పిలుపు మేరకు నాయకుడిని గెలిపించడానికి అహర్నిశలు కృషి చేసింది ఈ ఉద్యమకారులే.. అయినప్పటికీ వారికి మండల, జిల్లా కమిటీలలో అసలు ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఇటు కార్యకర్తలను మరోవైపు ఉద్యమకారులను నిరుత్సాహానికి గురి చేస్తున్నది. త్వరలో జరగబోయే గ్రామ, మండల, పట్టణ, జిల్లా కమిటీలో ఈసారైనా తమకు ప్రాధాన్యత ఇస్తారని అనేకమంది టీఆర్ఎస్ శ్రేణులు, ఉద్యమకారులు ఎదురుచూస్తున్నారు.


త్వరలో జరగబోయే టీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష పదవిలో ప్రధానంగా మూడు పేర్లు వినిపిస్తున్నాయి.


1) స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేంద్ర రావు.


2) ఉద్యమ నాయకుడు జేవీఎస్ చౌదరి.


3) తుల్లూరి బ్రహ్మయ్య.


ఈ ముగ్గురు జిల్లా అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో అధ్యక్ష పదవి ఎవరికి వస్తుందన్న చర్చకి వస్తే.. జేవీఎస్ చౌదరి పేరు ప్రధానంగా వినపడుతోంది. విద్యా సంస్థల అధిపతిగా యువతకు అత్యధికంగా ప్రాధాన్యమిచ్చే నాయకుడిగా పేరు ప్రతిష్టలు ఉండడంతోపాటు నియోజకవర్గ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించడం వంటి అనేక అంశాలు జేవిఎస్ చౌదరికి జిల్లా అధ్యక్ష పదవి వరించడానికి ప్రధాన మార్గాలుగా కనిపిస్తున్నాయి.


అంతేకాక ఉద్యమ కాలం నుండి కల్వకుంట్ల తారక రామారావుకు అత్యంత సన్నిహితంగా ఉండడంతో పాటు, ఉద్యమ సమయంలో వెన్నంటి ఉన్న జేవీఎస్ చౌదరికి కేటీఆర్.. ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటే జిల్లా పీఠం కచ్చితంగా జేవీఎస్‌కే దక్కుతుందన్న గట్టి వాదనలు పట్టణంలో అధికంగా వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఈసారి ఉద్యమకారులకు అధిక ప్రాధాన్యత ఇచ్చే అంశంపై అధిష్టానం దృఢసంకల్పంతో ఉన్నట్లు తెలుస్తోంది.


మలిదశ తెలంగాణ ఉద్యమ ప్రభావం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అంతంతమాత్రంగానే ఉన్నా.. ఆ రోజుల్లో టీఆర్ఎస్ పార్టీలోకి జేవీఎస్ అరంగేట్రం ఉద్యమానికి ఊపిరి పోసింది అనడానికి ఏమాత్రం అతిశయోక్తి లేదు అంటున్నారు జిల్లా ప్రజలు. జిల్లాలో ముక్కి మూలిగి నడుస్తున్న తెలంగాణ ఉద్యమానికి జేవీఎస్ చౌదరి కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో సుమారు 2000 మంది యువతతో కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకొని జిల్లాలో ఉద్యమాన్ని ఉధృతం చేశారు.


గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమంలో పాల్గొన్నారు. కేసులకు సైతం వెనకాడలేదు. ఇతనిపై సుమారు 10 కేసులు నమోదు చేశారు. రాష్ట్రమంతా కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తున్న సమయంలో రెండు వేల మంది అనుచర గణాన్ని ఉద్యమానికి అందించడం సామాన్యమైన అంశం కాదని ఇప్పటికీ కొంతమంది ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వృత్తిపరంగా విద్యా సంస్థల అధిపతి అయిన జేవీఎస్ తమ కళాశాలలో చదువుతున్న అనేక మంది పేద విద్యార్థులకు అండగా నిలిచి వారి మనసు గెలుచుకున్నాడు.


ఏదేమైనా ఈసారి జిల్లా అధ్యక్ష పదవి ఉద్యమకారుడు అయిన జేవీఎస్ చౌదరికి వస్తుందన్న గట్టి వాదనలు నిజమవుతాయా.? ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇస్తారా.? లేదా అన్న అంశాలకు తెర పడాలంటే జిల్లా ప్రజలు మరో కొంత కాలం ఎదురు చూడక తప్పదు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com