ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'మట్టి చిగురు' పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 18, 2021, 01:54 PM

మనిషి మనుగడకు మొక్కలు తప్పనిసరి అని, మానవ జీవితంలో అతిగొప్ప పని మొక్కలు నాటడమేనని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. మొక్కలు పెంచాలి, పర్యావరణాన్ని కాపాడాలి అన్న ఆచరణ స్పూర్తితో తెలంగాణ ప్రభుత్వం ముందకుసాగుతుందని అన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పర్యావరణానికి సంబంధించి వినూత్నంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్, తెలంగాణ హరితహారం కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించే కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఉద్యమాన్ని నిక్షిప్తం చేసిన 'మట్టి చిగురు ' పుస్తకాన్ని ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత పౌరసమాజం పై ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ పుస్తకాన్ని వెలువరించినందుకు అభినందించారు. సంతోష్ కుమార్ చేపట్టిన చిట్టి మొలకలతో పెరుగుతున్న వృక్షసంపద, పర్యావరణ పరిరక్షణను ఈ పుస్తకంలో తెలియ జేశా రన్నారు.


ప్రపంచవ్యాప్తంగా మరీ ముఖ్యంగా భారత దేశ వ్యాప్తంగా పర్యావరణం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి విజయం సాధించిన సామాన్యుల అసమాన్య ధీరోదాత్త గాథలు,నిత్యం స్ఫూర్తిదాయకంగా ఉండేలా 'మట్టి చిగురు ' పుస్తకాన్ని తీర్చిదిద్దడం బాగుందన్నారు.


చిప్కో ఉద్యమ కారుడు సుందర్ లాల్ బహుగుణ, స్వచ్ఛ విత్తనాల కోసం గళమెత్తిన వందనాశివ,నర్మదాబచావో ఆందోళన, తెహ్రీడ్యామ్ వ్యతిరేక ఉద్యమం పాండురంగా హెగ్డే, 'అప్పికో' ఆందోళన, రాజేంద్రసింగ్ జోహడ్ పథకం, గూగుల్ పై ఆకుపచ్చని గీత గా నిలిచిన వనజీవి రామయ్య, రోడ్ పొడవునా మొక్కలు నాటిన సాలుమరద తిమ్మక్క,1360 ఎకరాల అడవిని పెంచిన జాదవ్ పాయెంగ్ లాంటి పర్యావరణ ఉద్యమకారుల్ని ఈ పుస్తకం తెలియజేస్తుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక, యువజన క్రీడలశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, సాంఘిక సంక్షేమ శాఖామాత్యులు కొప్పుల ఈశ్వర్, గిరిజన మహిళ శిశు సంక్షేమ శాఖమాత్యులు సత్యవతి రాథోడ్, పంచాయితీరాజ్ శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎం.ఎల్.సి పల్లారాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే శాంకర్ నాయక్, 'మట్టి చిగురు' పుస్తకానికి సంపాదకత్వం వహించిన కవి, రచయిత జూలూరు గౌరీశంకర్, గ్రీన్ ఇండియా చాలెంజ్ రాఘవ పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com