ఈ రోజు నుండి నూతన మద్యం పాలసీ అమలు

  Written by : Suryaa Desk Updated: Wed, Dec 01, 2021, 09:12 PM
 

తెలంగాణలో ఈ రోజు నుండి నూతన మద్యం పాలసీ అమలుకానుంది. రెండు సంవత్సరాల పాటు ఈ పాలసీ అమలులో ఉంటుందని  రాష్ట్ర అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేసారు. 2019-2021 మద్యం షాపుల లైసెన్స్‌ ముగియడంతో కొత్త మద్యం దుకాణాలకు తెలంగాణ సర్కార్‌ టెండర్లు నిర్వహించింది. ఈ టెండర్లకు దరఖాస్తు చేసుకునే వారికి రూ.2లక్షల రుసుము విధించింది. ఈ నేపథ్యంలో 2,620 మద్యం దుకాణాలకు గాను 48 మినహా మిగతా దుకాణాలకు లైసెన్స్ లు మంజూరు చేసినట్లు ఎక్సైజ్‌ శాఖ అధికారులు వెల్లడించారు.

2017-19 పాలసీ కాలం లో డిపోల నుండి రూ.40,837 కోట్ల మద్యం అమ్మకాలు జరుగగా, 2019 నవంబర్ ఒకటి నుండి 2021 నవంబర్ 30 వరకు డిపోల నుండి రూ. 56,769 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా అంతకు ముందు పాలసీతో పోల్చుకుంటే సుమారు రూ.16 వేల కోట్లు అధికంగా అమ్మకాలు జరిగాయన్నారు. నవంబర్‌లో ప్రభుత్వంకి మద్యం అమ్మకాలు, లైసెన్స్ ఫీ, దరఖాస్తు ఫీ రూపంలో రూ.4 వేల కోట్ల కు పైగా ఆదాయం సమకూరినట్లు పేర్కొన్నారు. ఇందులో దరఖాస్తుల ద్వారా రూ.1,357 కోట్లు, మద్యం అమ్మకాల ద్వారా రూ.2,187 కోట్లు ఆదాయం వచ్చినట్లు స్పష్టం చేశారు.