ఎవర్ గ్రీన్ హైదరాబాదే...మరోసారి రికార్డు

  Written by : Suryaa Desk Updated: Fri, Jan 14, 2022, 10:53 PM
 

మహానగరం హైదరాబాద్ కు దేశంలో రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది. కారణం దాని విశిష్టత దానికి ఉండటమే. విశ్వనగరి భాగ్యనగరి సిగలో మరో రికార్డు వచ్చింది. మెట్రో నగరాల్లో 2011- 2021 దశాబ్ద కాలంలో పచ్చదనం విస్తీర్ణం గ్రేటర్‌లో అత్యధికంగా పెరిగింది. ఢిల్లీలో 19.91 చదరపు కి.మీ పెరగగా.. అహ్మదాబాద్‌లో 8.55 చ.కి.మీ, బెంగళూరులో 4.98 చ.కి.మీ తగ్గింది. జీహెచ్‌ఎంసీ విస్తీర్ణం 634.18 చ.కి.మీ పరిధిలో 2011లో కేవలం 33.15 చ.కి.మీ మేర పచ్చదనం ఉండగా అది 2021లో 81.81 చ.కి.మీటర్లకు పెరిగింది. నగరంలో పచ్చదనం శాతం 5.23 శాతం నుంచి 12.9 శాతానికి పెరిగింది. ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలను ప్రస్తావించింది. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న శ్రద్ధ, హరితహారం వంటి కార్యక్రమాలతో నగరంలో పచ్చదనం క్రమేపీ పెరుగుతోంది. గ్రేటర్‌లో ఇప్పటి వరకు నిర్వహించిన హరితహారం కార్యక్రమాల్లో భాగంగా నాలుగు కోట్ల మొక్కలు ప్రభుత్వం తరపున నాటడం, ప్రజలకు పంపిణీ చేయడం వంటివి చేశారు. లేఔట్‌లలోని ఖాలీస్థలాల్లో, ప్రభుత్వ కా ర్యాలయాలు, సంస్థల ప్రాంగణాల్లో, చెరువులు, సరస్సుల వెంబడి, కాలనీల్లో ఖాలీగా ఉన్న స్థలాల్లో విరివిగా నాటారు. అవెన్యూ ప్లాంటేషన్‌ పేరుతో రోడ్ల వెంబడి, ఇతర బహిరంగ ప్రదేశాల్లో పెద్ద చెట్లుగా ఎదిగే మొక్కలు నాటారు.ఈ కార్యక్రమాల కోసం ఇప్పటి వరకు దాదాపు రూ. 50 కోట్లు ఖర్చు చేశారు. ఇటీవలి కాలంలో ఎక్కడా ఖాళీ ప్రదేశమన్నది కనిపించకుండా మొక్కలు నాటేందుకు కొన్ని కాలనీల్లో ఇప్పటికే చర్యలు చేపట్టారు. జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌లోనూ గ్రీన్‌ బడ్జెట్‌ పేరిట పది శాతం నిధుల్ని పచ్చదనం పెంపు కార్యక్రమాలకు కేటాయించారు. గ్రేటర్‌ నగరంలో దాదాపు 4850 కాలనీలు ఉన్నాయి. ఆయా కాలనీ అన్నింటిలో ఎక్కడా ఖాళీ స్థలం కనిపించకుండా, ఇక నాటేందుకు ఎక్కడా జాగాలేదు అనేలా మొక్కలు నాటే చర్యలకు సిద్ధమయ్యారు. చిట్టడవులుగా పెరిగే మియావాకీ విధానానికీ తగిన ప్రాధాన్యం ఇచ్చారు. పార్కులతోపాటు ఫ్లైఓవర్ల కింద, రోడ్ల వెంబడి సెంట్రల్‌ మీడియన్లలో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు.