మిల్లెట్ మ్యాన్‌గా ప్రాచుర్యం పొందిన పీవీ సతీష్(77) కన్నుమూశారు. కొన్నేళ్లుగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుది శ్వాస విడిచారు. సేంద్రియ వ్యవసాయం, చిరుధాన్యాల సాగు కోసం దశాబ్దాలుగా కృషి చేసినందుకు పీవీ సతీష్‌ను 'మిల్లెట్ మ్యాన్'గా పిలుస్తారు.
ఇదిలావుంటే ఆయన హైదరాబాద్‌లోని దూరదర్శన్‌లో డైరెక్టర్‌గా పనిచేశారు. 1945 జూన్ 18న కర్ణాటకలో జన్మించిన పీవీ సతీష్.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కేంద్రంగా దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీని స్థాపించారు. రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా సహజ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తూ రైతుల్లో అవగాహన కల్పించారు సతీష్. జహీరాబాద్ ప్రాంతంలో దళిత మహిళా సాధికారతకు పీవీ సతీష్ విశేషంగా కృషి చేశారు.