ఎట్టకేలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పోరాటం ఫలించబోతోంది. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లు ప్రవేశపెట్టాలని పోరాడుతోన్న కవిత పోరాటానికి ఇన్ని రోజులకు మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశ పెట్టే ఛాన్స్ ఉన్నట్టు సమాచారం. అయితే.. మూడు రోజుల పాటు జరగనున్న ఈ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో 20వ తేదీన ఈ బిల్లు చర్చకు రానున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఈరోజు పాత పార్లమెంట్ భవనంలోనే ప్రత్యేక సమావేశాలు ప్రారంభమవగా.. రేపటి నుంచి కొత్త భవనంలో సమావేశాలు జరగనున్నాయి.
చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టాలని ఎమ్మెల్సీ కవిత చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా.. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఒక రోజు దీక్ష కూడా చేశారు. ఈ దీక్షకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీల నుంచి మంచి మద్దతు వచ్చింది. ఇప్పటివరకు.. ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలంటూ.. దేశంలోని 49 రాజకీయ పార్టీలను కవిత కోరారు. ఈ ప్రతిష్టాత్మక బిల్లు కోసం.. రాజకీయ విభేదాలను పక్కన పెట్టి.. అందరూ ఒక్క మాటపై నిలబడి మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఒత్తిడి తేవాలని ఆయా పార్టీలను కవిత అభ్యర్థించారు.
ఇదిలా ఉంటే.. ఈ మహిళ బిల్లుపై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి.. కేంద్రానికి పంపించింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి సమావేశంలోనే తీర్మానం చేసి పంపించటం గమనార్హం. అంతేందుకు.. ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తారని తెలియగానే.. మహిళా బిల్లుతో పాటు బీసీ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం పొందేలా చూడాలాని కోరుతూ ప్రధానికి సీఎం కేసీఆర్ లేఖలు కూడా రాశారు. ఈ రెండు బిల్లులపై సమావేశాల్లో వీలైనంతగా తన గళాన్ని వినిపించాలని బీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం కూడా చేశారు.