తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. అయితే.. ప్రచారానికి ఒక్క రోజు మాత్రమే సమయం ఉండగా.. నవంబర్ 30 న నిర్వహించనున్న పోలింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఎన్నికలు పకడ్బంధీగా జరిగేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అయితే.. రాజకీయ నేతలు ప్రచారంతో పాటు ఓటింగ్ రోజు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. రాజకీయ నేతలే కాకుండా.. సినీ, క్రీడా ప్రముఖులతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ అధికాలు కూడా ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ బైక్ ట్యాక్సీ సంస్థ అయిన ర్యాపిడో విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో.. తెలంగాణ ఎన్నికల పోలింగ్ రోజు ఓటర్లందరికీ ఫ్రీ రైడ్ ప్రకటించింది. హైదరాబాద్ నగరంలో ఉన్న మొత్తం 2,600 పోలింగ్ కేంద్రాలకు ఓటర్లను ఉచితంగా తీసుకెళ్లనున్నట్టు ర్యాపిడో సంస్థ వెల్లడించింది.
పోలింగ్ కేంద్రాలు దూరం ఉండటం వల్లో.. లేదా ప్రయాణ ఖర్చులకు భయపడో కొంత మంది ఓటు హక్కును వినియోగించుకోకుండా ఉండిపోకూడదన్న ఉద్దేశంతోనే.. ఈ ఆఫర్ ప్రకటించినట్టు ర్యాపిడో సహ వ్యవహస్థాపకుడు పవన్ గుండుపల్లి తెలిపారు. నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా.. తమ పోలింగ్ కేంద్రానికి వెళ్లేందుకు తమ సంస్థ పూర్తి ఉచితంగా సహకరిస్తుందని చెప్పుకొచ్చారు. పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలనుకునే ఓటర్లకు తమవంతు సాయం చేస్తామని.. ఈ ఫ్రీ రైడ్ ద్వారా ఓటింగ్ శాతం పెరిగేందుకు కృషి చేయనున్నట్టు తెలిపారు. ముఖ్యంగా యువ ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించడంలో తమ ఫ్రీ రైడ్ ఆఫర్ ఉపయోగపడుతుందని భావిస్తున్నట్టు ఆకాంక్షించారు. ఇండియాకు ప్రజాస్వామ్యమే ఆభరణం అని.. ఆ ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకునేలా తమవంతు తోడ్పాడు అందిస్తామన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని పవన్ పిలుపునిచ్చారు.