తెలంగాణలో పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలవుతుందో లేదో తెలియదు కానీ.. లీడర్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అయితే నడుస్తుందంటూ చాలా రోజలుగా విమర్శలు వస్తున్నాయి. అయితే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఇది మరోసారి బయటపడింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ జడ్పీటీసీ గుడాల అరుణ భర్త శ్రీనివాస్ సోమవారం ఉదయం.. స్థానిక పోలీస్ స్టేషన్‌లో సినిమా పాటలకు డ్యాన్సులు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.
ఉదయం సమయంలో వాకింగ్ డ్రెస్‌లో ఉన్న శ్రీనివాస్.. పోలీస్ స్టేషన్‌లో మన్మథుడు నాగార్జున నటించిన "నేనున్నాను" సినిమాలోని " ఏరోరి అంతగాడా.. నన్నేలు మన్మథుడా.." అనే పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశారు. సినిమాలో హీరో నాగర్జున వేసిన స్టెప్పులను మించి.. శ్రీనివాస్ వేశారు. పోలీస్ స్టేషన్‌లో ఓ నేత.. సినిమా పాటకు డ్యాన్స్ చేయటమే ఓ విడ్డూరమంటే.. ఆయన వేసే స్టెప్పులను ఎంకరేజ్ చేస్తూ.. కానిస్టేబుళ్లు వీడియోలు కూడా తీశారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రీనివాస్.. ఉదయం వాకింగ్ వెళ్లి వస్తూ నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అక్కడ ఉన్న కానిస్టేబుళ్లను పలకరించారు. ఈ క్రమంలోనే.. ఓ సందర్భంలో శ్రీనివాస్ చేసిన డ్యాన్స్ గురించి ప్రస్తావించగా.. బాగా చేస్తారని, ఓ రెండు స్టెప్పులు తమ కోసం వేయాలంటూ కానిస్టేబుళ్లు కోరటంతో.. సరే అన్నారు. ఇంకేముంది.. మొబైల్‌లో పాట ప్లే చేయడంతో శ్రీనివాస్ డ్యాన్స్ ఇరగదీశారు.
మధ్యమధ్యలో.. మీరు భలే చేస్తారన్న.. ఈ స్టెప్పులు కూడా ఒక ఎక్సర్ సైజ్.. ఇప్పుడే ఇంత హుషారు ఉందంటే.. ఇక అప్పట్లో ఇరగదీసి ఉంటారు.. అంటూ కానిస్టేబుళ్లు చీర్స్ కూడా చేయటం వీడియోలో రికార్డయ్యింది. షురు చేశాడు. ఈ డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో బయటకు రావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదే విషయంపై శ్రీనివాస్‌ను వివరణ కోరగా.. డ్యాన్స్ అనేది ఒక ఎక్సర్ సైజ్ అని చెప్పారు. తనతో చనువుగా ఉండే కానిస్టేబుళ్ల కోసం చేసి చూపించానన్నారు. ఆ వీడియో తీసింది.. కానిస్టేబుళ్లు కాదని.. తనతో ఉన్నవాళ్లే తీశారని తెలిపారు. అయితే.. అది వేరే ఉద్దేశంతో చేసింది కాదని శ్రీనివాస్ వివరించారు. ఈ వీడియోను.. తానే ఒక గ్రూపులో పోస్టు చేయగా.. దీనిని రాద్ధాంతం చేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు.