బయటికి కనిపించేదంతా నిజం కాదు.. లోపల ఇంకేదో మర్మం ఉంటుంది.. అన్నట్టుగానే హైదరాబాద్‌లో ఓ కిరాణా దుకాణానికి సంబంధించిన యవ్వారాన్ని పోలీసులు బయటపెట్టారు. ప్రస్తుతం దేశమంతా ఎన్నికల హడావిడి నడుస్తుంటే.. పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. అయినప్పటికీ ఏమాత్రం భయం లేకుండా స్మగ్లర్లు మాత్రం విచ్చలవిడిగా తమ పని తాము కానిచ్చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో చాపకింద నీరుగా గంజాయి, మాదక ద్రవ్యాల సరఫరా సాగుతోంది. ఇప్పటికే తెలంగాణ సర్కారు గంజాయి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించగా.. పోలీసుల కంటపడకుండా.. స్మగ్లర్లు మాత్రం రకరకాల పద్దతుల్లో గంజాయిని అమ్ముతున్నారు. ఈమధ్య గంజాయిని చాక్లెట్ల రూపంలో విక్రయిస్తున్నారు.
తాజాగా హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టలోని జయశ్రీ ట్రేడర్స్ పేరుతో ఉన్న కిరాణా దుకాణంలో భారీ ఎత్తున గంజాయి చాక్లెట్లు పట్టుబడ్డాయి. కిరాణా దుకాణంలో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఎస్వోటీ పోలీసులు దాడి చేశారు. గంజాయి చాక్లెట్స్ విక్రయిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
మొత్తం 26 కిలోల బరువున్న 6400 గంజాయి చాక్లెట్స్ (160 ప్యాకెట్ల)తో పాటు 4 కేజీల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. వీటి మొత్తం విలువ రూ.2.66 లక్షలుంటుందని పోలీసులు అంచనా వేశారు. ఈ కేసులో.. కోల్‌కతాకు చెందిన మనోజ్ కుమార్ అగర్వాల్‌ను అరెస్ట్ చేయగా.. మోహన్ అనే నిందితుడు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఇద్దరు నిందితులపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి.. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.